ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన భయానక రైలు ప్రమాదం అందరిలోనూ దడ పుట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకూ 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యుముఖాన్ని చూసి, ప్రాణాలతో బతికి బట్టకట్టారు. అలాగే ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు కూడా చాలామంది ఉన్నారు. వీరు ఈ ఘటనను మరువలేకపోతున్నామని చెబుతున్నారు.
బాలేశ్వర్‌కు చెందిన జితేంద్ర నాయక్ ఈ ఘటనను ప్రత్యక్షంగా చూశారు. ఆయన ఈ దుర్ఘటన సంభవించిన సమయంలో తనకు ఎదురైన అనుభూతిని మీడియాకు తెలిపారు. జితేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ ‘ నేను ఆ సమయంలో కోరమాండల్‌లోని జనరల్ బోగీలో ప్రయాణిస్తున్నాను. ఆ బోగీలో 100 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. దీంతో బోగీ రద్దీగా మారింది. బోగీలో నేను కింద కూర్చున్నాను. రైలు ముందుకు కదిలిన కొద్దసేపటికే రైలులో వైబ్రేషన్ మొదలయ్యింది. ట్రైన్ అటుఇటు కదులుతున్నట్లు అనిపించింది. కొన్ని నిముషాల తరువాత హఠాత్తుగా పెద్ద కుదుపు వచ్చింది. దాని తరువాత ఏమయ్యిందో తెలియలేదు.
చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’
రైలు అంతా పొగమయంగా మారిపోయింది. కళ్లు నులుముకుని చూసే సరికి, కొందరు చేతులు తెగి పడినవారు, కాళ్లను కోల్పోయినవారు, ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయినవారు కనిపించారు. నేను రైలులో నుంచి ఎలాగోలా బయటకు వచ్చాను . అప్పుడు నాకు కొత్త జీవితం దొరికినట్లు అనిపించింది. ఆ సమయంలో నన్ను ఎవరూ కాపాడలేదు. నేనే అతి కష్టం మీద శిధిలాల నుంచి బయటపడ్డాను. ఆ సమయంలో చాలామంది క్షతగాత్రులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. నేను ప్రయాణించిన జనరల్ బోగీలోని ప్రయాణికులెవరూ బతికివుండే అవకాశం లేదు. భగవంతుడు నాకు నూతన జీవితాన్ని ప్రసాదించాడు. అందుకు నేను భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment