Indore Temple Tragedy: Days After 36 Deaths, Indore Municipal Deploys Bulldozer & Demolishes Illegal Structures - Sakshi
Sakshi News home page

ఇండోర్‌ ఘోర ప్రమాదం: ఆలయంలోకి బుల్డోజర్లు.. ఆ అక్రమ కట్టడం కూల్చివేత

Published Mon, Apr 3 2023 11:23 AM | Last Updated on Mon, Apr 3 2023 12:04 PM

After 36 Deaths Bulldozers Treatment For Indore Temple - Sakshi

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో 36 మందిని బలిగొన్న ఆలయ ప్రాంగణంలోకి బుల్డోజర్లు ప్రవేశించాయి. సోమవారం ఉదయం బేలేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయంలో ప్రమాదానికి కారణమైన అక్రమ కట్టడాన్ని కూల్చివేతను అధికారులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, కూల్చివేతను ఎవరూ అడ్డుకోకుండా కట్టదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.  

ఆలయ ప్రాంగణంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చేందుకు ఇండోర్‌ మున్సిపల్‌ అధికారులు సోమవారం రంగంలోకి దిగారు. కూల్చివేతలకు ఆటంకాలు ఎదురుకాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు.. సుమారు నాలుగు పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీస్‌సిబ్బంది అక్కడ మోహరించారు. జిల్లా మెజిస్ట్రేట్‌(కలెక్టర్‌) ఇళయరాజా, ఇండోర్‌ డిప్యూటీ మున్సిపల్‌ కమిషనర్‌, ఇతర అధికారులు దగ్గరుండి ఆ కూల్చివేతలను పర్యవేక్షించారు. 

ఆలయ ట్రస్ట్‌ నిర్వాహకులు.. ఆలయంలో మెట్లబావిని మూసేస్తూ కాంక్రీట్‌స్లాబ్‌వేయగా.. శ్రీరామ నవమి నాడు ఆ స్లాబ్‌ ఉన్న ప్రాంతంలోనే యాగం చేయడం, భక్తుల బరువును మోయలేక ఆ పైకప్పు కూలిపోయి భక్తులు బావిలో పడిపోయి మరణించడం తెలిసిందే. 

స్థానికులు కొందరు ఫిర్యాదు చేయడంతో.. అది అక్రమ కట్టడం అని ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కిందటి ఏడాది ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు పంపింది. అంతేకాదు.. ఆ పైభాగానికి కూల్చివేసేందుకు మార్క్‌ కూడా చేసింది.  కానీ, ఆ సమయంలో మతపరమైన మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆలయ ట్రస్ట్‌ నిరసన వ్యక్తం చేయడంతో.. అధికారులు వెనక్కి తగ్గారు. ఒకవేళ అధికారులు ఆనాడే దూకుడుగా స్పందించి ఉంటే.. నేడు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి ఉండేవి కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.. 

ఇండోర్‌ స్నేహ్‌ నగర్‌లో పూర్తిగా ప్రైవేట్‌ ట్రస్ట్‌ ఆధీనంలోనే ఆ ఆలయం నడుస్తోంది.  రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న మెట్ల బావిని కేవలం నాలుగు ఐరన్‌ గ్రిడ్స్‌తో.. పైన సన్నని కాంక్రీట్‌ లేయర్‌, టైల్స్‌తో కప్పేసి పూజల కోసం ట్రస్ట్‌ నిర్వాహకులు వినియోగిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ అక్రమ కట్టడంతో పాటు చుట్టుపక్కల పార్కింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సైతం కూల్చేస్తున్నారు అధికారులు.

మరోవైపు.. ఇండోర్‌ ఆలయ ప్రమాద ఘటనతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మేల్కొంది. రాష్ట్రంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్న ఆలయ కట్టడాలను, బావుల్ని గుర్తించి.. తక్షణమే వాటిని మరమ్మత్తులు చేపట్టాలని, అలాగే ఆలయాల ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే గుర్తించి తక్షణమే వాటిని తొలగించడం లేదంటే పటిష్టమైన జాగ్రత్తలు తీసుకోవడం లాంటి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదివారం ప్రత్యేక సమావేశంలో ఆదేశించారు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement