ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.
మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు.
ఇండోర్ స్నేహ్‌నగర్‌లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు.
ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.
అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్‌లోనే ఆలయ ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది.
శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్‌పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment