
సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14వ ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే హోసూరు గులాబీలకు రెక్కలు వస్తాయి. ప్రపంచం నలుమూలలకూ ఎగుమతి అవుతాయి. ప్రియుడు ప్రేమను చాటుకోవడానికి గులాబీల పువ్వులే సాయపడతాయి. ఈసారి 20 లక్షల గులాబీ పూలకు ఆర్డర్లు వచ్చాయి. హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతంలో గులాబీ, ఇతర పుష్పాల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో పెద్దఎత్తున రైతులు గ్రీన్‌షెడ్లు ఏర్పాటు చేసి జరబరా, రోజా, కార్నేషన్ తదితర పూలతోటలను పెంచుతున్నారు.
విదేశాలకు ఎగుమతులు
వాలెంటైన్స్ డే కి హోసూరు ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం ఆ్రస్టేలియా, దుబాయ్, ఇంగ్లాండ్, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని 20 లక్షలకుగా తాజ్‌మహల్ రకం గులాబీలను ఎగుమతి చేపట్టారు. ఒక్కో పువ్వు ధర రూ. 20 నుంచి రూ. 22 దాకా పలుకుతుందని వ్యాపారులు, రైతులు తెలిపారు. స్థానిక మార్కెట్‌లో రూ. 14 నుంచి రూ. 18 వరకు అమ్ముతారు. మంచి ధరలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గులాబీ మొక్కలకు సైతం
ప్రేమికుల రోజు ఒక్క రోజా పూవు అందజేస్తే రెండో రోజుకు ఎండిపోతుందని, ప్రేమ నిలకడగా ఉండాలని ఆశిస్తూ కొంత మంది ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీ మొక్కలను అందజేయడం మొదలైంది. గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నర్సరీలలో రోజా మొక్కలకు ముందే ఆర్డర్లు ఇవ్వడంతో మిగతావారికి దొరకడం కష్టంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment