rose flower
-
Valentine's Day: ప్రేమికులు మెచ్చిన హోసూరు గులాబీ
సాక్షి, బెంగళూరు: ఫిబ్రవరి 14వ ప్రేమికుల దినోత్సవం వస్తోందంటే హోసూరు గులాబీలకు రెక్కలు వస్తాయి. ప్రపంచం నలుమూలలకూ ఎగుమతి అవుతాయి. ప్రియుడు ప్రేమను చాటుకోవడానికి గులాబీల పువ్వులే సాయపడతాయి. ఈసారి 20 లక్షల గులాబీ పూలకు ఆర్డర్లు వచ్చాయి. హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతంలో గులాబీ, ఇతర పుష్పాల సాగుకు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉండడంతో పెద్దఎత్తున రైతులు గ్రీన్షెడ్లు ఏర్పాటు చేసి జరబరా, రోజా, కార్నేషన్ తదితర పూలతోటలను పెంచుతున్నారు. విదేశాలకు ఎగుమతులు వాలెంటైన్స్ డే కి హోసూరు ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం ఆ్రస్టేలియా, దుబాయ్, ఇంగ్లాండ్, సింగపూర్, అమెరికా తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ ఏడు ప్రేమికుల రోజును పురస్కరించుకొని 20 లక్షలకుగా తాజ్‌మహల్ రకం గులాబీలను ఎగుమతి చేపట్టారు. ఒక్కో పువ్వు ధర రూ. 20 నుంచి రూ. 22 దాకా పలుకుతుందని వ్యాపారులు, రైతులు తెలిపారు. స్థానిక మార్కెట్లో రూ. 14 నుంచి రూ. 18 వరకు అమ్ముతారు. మంచి ధరలు ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ మొక్కలకు సైతం ప్రేమికుల రోజు ఒక్క రోజా పూవు అందజేస్తే రెండో రోజుకు ఎండిపోతుందని, ప్రేమ నిలకడగా ఉండాలని ఆశిస్తూ కొంత మంది ప్రేమికులు తమ ప్రేయసికి గులాబీ మొక్కలను అందజేయడం మొదలైంది. గులాబీ మొక్కల పెంపకానికి ప్రసిద్ది పొందిన అగళకోట ప్రాంతంలోని నర్సరీలలో రోజా మొక్కలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం నర్సరీలలో రోజా మొక్కలకు ముందే ఆర్డర్లు ఇవ్వడంతో మిగతావారికి దొరకడం కష్టంగా ఉంది. -
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రహదారి నిబంధనలు పాటిస్తే వాహనచోదకులు కుటుంబ సభ్యులతో కలసి పువ్వులాగా నవ్వుకోవచ్చని జిల్లా ఎస్పీ గోసీనాథ్‌జట్టి సూచించారు. సోమవారం సాయంత్రం రాజ్‌విహార్‌లో వాహనదారులకు రహదారి నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ.. స్వయంగా హెల్మట్ ధరించిన ద్విచక్ర వాహనదారులు, షీటు బెల్టు పెట్టుకున్న ఫోర్వీలర్స్లకు రోజాపువ్వు, చాక్లెట్ ఇచ్చి అభినందించారు. ఇదే సమయంలో రహదారి భద్రత నియమాలను పాటించని వారికి మంత్రణం చేశారు. అంతకముందు టూటౌన్ పోలీసు స్టేషన్ నుంచి రాజ్‌విహార్ వరకు రహదారి నియమాలను పాటించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నాయన్నారు. హైవేల్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా ప్రజలు రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలేదన్నారు. దీంతో ఎంతో మంది ప్రాణాలను కోల్పోయి కుటుంబాలను వీధిపాలు చేసుకుంటన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకారం అందించాలని కోరారు .డీఎస్పీలు ఖాదర్‌బాషా, సీఎం గంగయ్య, సీఐలు రామయ్యనాయుడు, నాగరాజుయాదవ్, డేగల ప్రభాకర్ ట్రాఫిక్ ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఒక ప్రేమలేఖ... ఓ గులాబీ పువ్వు!
అమ్మాయికైనా అబ్బాయికైనా తొలి ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే, ‘ఐ లవ్ యు’ అని మొదట ప్రపోజ్ చేసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు. నయనతారకు అలా జీవితాంతం గుర్తుండిపోయే అబ్బాయి ఒకడు ఉన్నాడు. ఈ బ్యూటీ కో-ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుకున్నారు. అందుకని అబ్బాయిలందరితో స్నేహంగా ఉండేవారు. ఆ విషయం నయనతార చెబుతూ - ‘‘అమ్మాయిలతో ఎలా స్నేహంగా ఉండేదాన్నో అబ్బాయిలతో కూడా అలానే ఉండేదాన్ని. ఒకే ఒక్క అబ్బాయి తప్ప మిగతావాళ్లందరూ నాతో అలానే ఉండేవాళ్లు. అప్పుడు నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. నేను క్లాస్ గదిలోకి వచ్చేసరికే నా డెస్క్ కింద ఒక ప్రేమలేఖ, ఓ గులాబీ పువ్వు ఉండేవి. ఆ లేఖలో సంతకం ఉండేది కాదు. దాంతో ఎవరు రాశారో తెలియక తికమకపడేదాన్ని. చాలా భయం వేసేది. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్‌కి ఈ విషయం చెప్పాను. రోజుల తరబడి లవ్ లెటర్, పువ్వు దర్శనిమవ్వడంతో మా అమ్మకు చెప్పాను. స్కూల్‌కి వచ్చి మా అమ్మ కంప్లైంట్ చేశాక ఆ అబ్బాయి ఎవరో తెలిసింది. అతను ఏడో తరగతి అబ్బాయి. ప్రిన్సిపాల్ మేడమ్ పిలిచి, బాగా చీవాట్లు పెట్టారు. అసలా వయసు అబ్బాయికి ప్రేమ అంటే ఏంటో ఏం తెలుస్తుంది? ఆ విషయం ఇప్పుడు తల్చుకున్నా నాకు వింతగా ఉంటుంది’’ అని తెలిపారు. -
రెయిన్బో రోజా
అందమైన అతివలకు రంగు రంగుల దుస్తులు ఎంత అవసరమో గులాబీలకు కూడా అటువంటి అందమైన, ఆకర్షణీయమైన రంగు, రంగుల ఆకర్షణ పత్రావళి (పెటల్స్) ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉదకమండలంలోని వృక్ష శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిన ఆలోచనను అమలులో పెట్టిన శాస్త్రవేత్తలనే అబ్బరపరుస్తూ ఇలా రెయిన్బో రోజా దర్శనం ఇచ్చింది. ఇది పాక్షిక ప్రయోగంలోని భాగమేనని, పూర్తి ప్రయోగం సఫలమైతే గులాబీ పువ్వులోని ప్రతి రేకూ భిన్నమైన రంగులో ఉండేలా పూస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సంప్రదాయమైన ఎర్ర గులాబీ సోమాటిక్ జన్యువుల్లోకి భిన్నవర్ణాలకు చెందిన క్రోమోఫాస్టు జీన్స్‌ను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ రెయిన్బో రోజాను సృష్టించామని వారు తెలిపారు. క్రోమోప్లోస్టులు పువ్వులకు రంగునిచ్చే అంశాలని వారు చెప్పారు. ఇది నూటికి నూరుశాతం వినూత్న ప్రయోగం అన్నారు. ఇంతకు పూర్వం క్రోటన్ మొక్కలకు వైరసు జీవుల్లోని క్రోమోప్లాస్టు జన్యువును ఇంజెక్టు చేసి, వాటి ఆకులపై భిన్నమైన రంగులు వచ్చేలా చేసినట్లు గుర్తు చేశారు. పూర్తి స్థాయి ప్రయోగాల అనంతరం అసలు సిసలైన రెయిన్బో రోజాను వ్యాపారాత్మక స్థాయిలో రూపొందిస్తామని వారు తెలిపారు. మరి ఈ హరివిల్లు గులాబీ ఎంత ముచ్చటగా ఉందో చూడండి.