రెయిన్బో రోజా
అందమైన అతివలకు రంగు రంగుల దుస్తులు ఎంత అవసరమో గులాబీలకు కూడా అటువంటి అందమైన, ఆకర్షణీయమైన రంగు, రంగుల ఆకర్షణ పత్రావళి (పెటల్స్) ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉదకమండలంలోని వృక్ష శాస్త్రవేత్తలకు వచ్చింది. వచ్చిన ఆలోచనను అమలులో పెట్టిన శాస్త్రవేత్తలనే అబ్బరపరుస్తూ ఇలా రెయిన్బో రోజా దర్శనం ఇచ్చింది. ఇది పాక్షిక ప్రయోగంలోని భాగమేనని, పూర్తి ప్రయోగం సఫలమైతే గులాబీ పువ్వులోని ప్రతి రేకూ భిన్నమైన రంగులో ఉండేలా పూస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.
సంప్రదాయమైన ఎర్ర గులాబీ సోమాటిక్ జన్యువుల్లోకి భిన్నవర్ణాలకు చెందిన క్రోమోఫాస్టు జీన్స్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా ఈ రెయిన్బో రోజాను సృష్టించామని వారు తెలిపారు. క్రోమోప్లోస్టులు పువ్వులకు రంగునిచ్చే అంశాలని వారు చెప్పారు. ఇది నూటికి నూరుశాతం వినూత్న ప్రయోగం అన్నారు.
ఇంతకు పూర్వం క్రోటన్ మొక్కలకు వైరసు జీవుల్లోని క్రోమోప్లాస్టు జన్యువును ఇంజెక్టు చేసి, వాటి ఆకులపై భిన్నమైన రంగులు వచ్చేలా చేసినట్లు గుర్తు చేశారు. పూర్తి స్థాయి ప్రయోగాల అనంతరం అసలు సిసలైన రెయిన్బో రోజాను వ్యాపారాత్మక స్థాయిలో రూపొందిస్తామని వారు తెలిపారు. మరి ఈ హరివిల్లు గులాబీ ఎంత ముచ్చటగా ఉందో చూడండి.