కేంద్రం అలర్ట్‌.. ఎయిరిండియా కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

కేంద్రం అలర్ట్‌.. ఎయిరిండియా కీలక నిర్ణయం

Published Sat, Apr 13 2024 11:38 AM

Air India Flights Avoid Iranian Airspace Amid Rising Tensions In West Asia - Sakshi

న్యూఢిల్లీ: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతల వేళ ఎయిరిండియా విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ గగనతలం మీదుగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం.. యూరప్‌కు వెళ్లే విమానాలు ఇరాన్‌ గగనతలం నుంచి కాకుండా మరో మార్గంలో వెళ్లనున్నాయి. దీంతో ప్రయాణ సమయం మరింత పెరగనుంది.

ఇదిలా ఉంటే.. ఇండియా, ఫ్రాన్స్‌, రష్యా దేశాలు ఇప్పటికే ఇరాన్‌, ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు మానుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశాయి. అలాగే వీలైనంత వరకు ప్రయాణాల్ని తగ్గించుకోవాలని ఆయా దేశాల్లో ఉన్న భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయ రాయబార కార్యాలయం సాయం తీసుకోవాలని సూచించింది.

గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల జరిగిన ఏడు నెలల తర్వాత.. పశ్చిమాసియా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారింది.  టెల్‌అవీవ్‌పై క్షిపణులతో విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రపంచవ్యాప్తంగా అలజడిని రేపింది.  ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయొచ్చన్న సంకేతాలతో పలు దేశాలు తమ తమ పౌరుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. మరోవైపు యూఎస్‌ వార్‌షిప్‌లు ఇజ్రాయెల్‌కు చేరుకుంటుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement