అఫ్గానిస్తాన్ నుంచి జామ్‌నగర్ చేరుకున్న భారతీయులను స్వాగతిస్తున్న ప్రభుత్వ అధికారులు
న్యూఢిల్లీ: తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో కాబూల్‌లో భారత రాయబారిని, ఇతర దౌత్య సిబ్బందిని కేంద్రం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. దౌత్య సిబ్బందిని తీసుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానంలో మొత్తం 150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని తీసుకువచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ విమానం ల్యాండయింది. అంతకు ముందే మరో విమానంలో 40 మంది భారత్‌కి చేరుకున్నారు. (చదవండి: తాలిబన్లు సంచలన ప్రకటన)
దీంతో అఫ్గాన్ నుంచి దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి అంతా అక్కడున్న భారతీయుల్ని తీసుకురావడంపైనే ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీకి చేరుకోవడానికి ముందు ఉదయం ఇంధనం నింపుకోవడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో విమానం కాసేపు ఆగింది.
అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ జామ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాబూల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. అఫ్గాన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని వారిని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా తప్పనిసరిగా విమానాలు నడపాలన్నారు. అయితే తాము అఫ్గాన్ ప్రజల నుంచి దూరమయ్యేమని భావించడం లేదని , వారి సంక్షేమం కోసం ఏదైనా చేస్తామని అన్నారు. వారితో ఏర్పడిన బంధం విడదీయలేదని చెప్పారు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉంటామని, పరిస్థితులు ఎలా రూపాంతరం చెందుతాయో చెప్పలేమని టాండన్ పేర్కొన్నారు.
ఎదురైన ఎన్నో సవాళ్లు
భారతీయ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్నాళ్లూ రక్షణ కల్పించిన ఇండో–టిబెట్ సరిహద్దు భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) భద్రత మధ్య వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులకు వీసాలు ఇచ్చే కార్యాలయం షహీర్ వీసా ఏజెన్సీపై తాలిబన్లు దాడికి దిగడంతో రెండు విమానాల్లో సిబ్బందిని తీసుకువచ్చారు. తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు కాబూల్ విమానాశ్రయానికి వస్తుండగా తాలిబన్లు అడ్డగించారు. వారి దగ్గరున్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఇక రెండో విడత వచ్చిన విమానంలో రాయబారి టాండన్ సహా 30 మంది దౌత్య సిబ్బంది, 99 ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది సాధారణ పౌరులు ఉన్నారు.
కాబూల్‌లో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం: జై శంకర్
మరోవైపు కాబూల్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ç21 మంది భారత పౌరులను కాబూల్ నుంచి పారిస్‌కు తరలించినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
మన పౌరులను క్షేమంగా తీసుకురండి: ప్రధాని మోదీ
అఫ్గానిస్తాన్‌లోని భారత పౌరులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్‌కు రావాలని కోరుకుంటున్న అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులకు మన దేశంలో ఆశ్రయం కల్పించాలని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో భారత్‌లో భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశం నిర్వహించారు.
ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ల్, అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌లు హాజరయ్యారు. ఎంతో మంది అఫ్గాన్ పౌరులు భారత్ నుంచి సాయం అర్థిస్తున్నారని మోదీ చెప్పారు. వారందరికీ తగిన సాయం అందించాలని సూచించారు. (చదవండి: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment