సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
మనదేం బాగుంది?
శ్రీలంకలో 17.5 శాతం ‘చిల్లర వర్తక ద్రవ్యోల్బణం’ తర్వాత, గ్యాస్ సిలిండర్ ధర ప్రస్తుతం 4,500 శ్రీలంక రూపాయలు. (అంటే దాదాపు 1,200 ఇండియా రూపాయలు.) ఇండియాలో కూడా సిలిండర్ ధర దాదాపు అంతే ఉంది, అదీ 17.5 శాతం ద్రవ్యోల్బణం లేకుండానే.
– అక్షత్ శ్రీవాస్తవ, ఆంట్రప్రెన్యూర్
ఎందుకీ గొడవ?
నేను ముప్పై ఐదేళ్ల క్రితం ఢిల్లీ వచ్చినప్పటినుంచీ హలాల్ మటన్ మాత్రమే కొంటున్నాను. ఎందుకంటే నా ఉత్తరాది హిందూ మిత్రులు అదే కొనమన్నారు. అదే రుచికరం అని చెప్పారు. కేరళలో ఉన్నప్పుడు ఈ హలాల్, ఝట్కాల గురించి వినలేదు. పిల్లలుగా ఉన్నప్పుడు మటన్ ఇంటికి వచ్చేది. పెద్దయ్యాక బీఫ్ కూడా తినడం మొదలుపెట్టాం.
– ఆర్. రాజమోహన్, పబ్లిషర్
ఇదేం తర్కం?
ముస్లింలు ఝట్కా మాంసాన్ని తిరస్కరించడమంటే అది విశ్వాసానికి సంబంధించినది. హిందువులు హలాల్ మాంసాన్ని వద్దనడమంటే అది ఇస్లామోఫోబియానా?
– నార్బర్ట్ ఎలెకెస్, వ్యాఖ్యాత
మిత్రుడిని కోల్పోయాను
ఇప్పుడిది అధికారికం. మాక్స్ లెవిన్ చనిపోయాడు. ఉక్రెయిన్‌లోని అత్యుత్తమ ఫొటో జర్నలిస్టుల్లో ఒకడు. ప్రతిభతో పాటు సమగ్రత అతడి సొంతం. ఉక్రెయిన్‌లోని ఆటిజం పిల్లల మీద అతడు రాసిన వ్యాసాన్ని మరిచిపోలేను. 2012లో నేను దానివల్లే కలిశాను. కీవ్ దగ్గరలో రష్యన్ల చేతిలో లెవిన్ చనిపోయాడు.
– అలెక్సాండర్ షేర్బా, ఉక్రెయిన్ దౌత్యవేత్త
ఒకే తీరు
రష్యా మీద ఉక్రెయినియన్లలో ఎలాంటి భావం ఉంటుందో, పాకిస్తాన్ మీద అఫ్గానియన్లకు కూడా అలాంటి భావమే ఉంటుంది.
– బహార్ జలాలీ, అసోసియేట్ ప్రొఫెసర్
సొగసరి భారతం
అందరికీ కొంచెం ఆలస్యంగా ఉగాది శుభాకాంక్షలు. భారతదేశంలోని సౌందర్యం ఏమిటంటే, మనకు ప్రతీ సంవత్సరంలో పది పన్నెండు నూతన సంవత్సరాదులు వస్తాయి. మన గందరగోళంలో కూడా కొంత సొగసుంది.
– మాధవన్ నారాయణన్, పాత్రికేయుడు
పరిస్థితేం బాలేదు
విమానం ఎక్కడానికి ముందు చేసుకోవాల్సిన(ప్రి–ఫ్లైట్) కోవిడ్ పీసీఆర్ పరీక్షతో పాటు కొన్ని సామాన్లు కొందామని టౌను(లండన్)లోకి వెళ్లాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్న షాపుల సంఖ్య దిగ్భ్రాంతికి గురిచేసింది. మనం స్పష్టంగా ఆర్థికమాంద్యంలో ఉన్నాం.
– కాథరీన్ షొఫీల్డ్, హిస్టారియన్
Comments
Please login to add a commentAdd a comment