సంకీర్ణంలో భాగస్వామిగా కాకుండా సొంతంగా అధికారంలో ఉన్నది మూడంటే మూడు రాష్ట్రాల్లో.. అన్ని రాష్ట్రాల్లోనూ ముఠా తగాదాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో సమస్యలు చక్కదిద్దలేక కాంగ్రెస్ అధిష్టానం సతమతమవుతోంది. మరీ ముఖ్యంగా పంజాబ్ కాంగ్రెస్‌లో నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, అసంతృప్త నేత నవజోత్ సింగ్ సిద్ధూ వర్గాల మధ్య పోరు తారస్థాయికి చేరుకోవడంతో సీన్ హస్తినకి మారింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఢీ అంటే ఢీ అంటూ వస్తున్న మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ గళానికి మరికొందరు నేతలు ఇప్పుడు జత కలిశారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలైన అర్జున్ ప్రతాప్‌సింగ్ బజ్వా, భీష్మ పాండే కుమారులకు కారుణ్య నియామకాల కింద (వారి తాతలు వేర్పాటు ఉద్యమ కాలంలో ఖలిస్థాన్ ఉగ్రవాదుల చేతుల్లో హతమయ్యారని) ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి అమరీందర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది.
రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సునీల్ ఝాకర్, రాష్ట్ర మంత్రి సుఖ్‌జీందర్ రాంధ్వా సీఎం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కెప్టెన్ వ్యవహారశైలి ఇలాగే ఉంటే రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేశారు. వారిద్దరితో మంత్రులు రాజీందర్ సింగ్ బాజ్వా, రజియా సుల్తానా, చరణ్‌జిత్ సింగ్, ఇంకొందరు ఎమ్మెల్యేలు గళం కలిపారు. డిప్యూటీ సీఎం లేదంటే పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నవజోత్ సింగ్ సిద్ధూ సీఎంపై నేరుగానే మాటల తూటాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా, మీడి యా ఇంటర్వ్యూల్లోనూ అమరీందర్‌ను అబద్ధాల కోరుగా వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ తలనొప్పుల్ని పరిష్కరిం చడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఒక కమిటీ వేసి రాష్ట్రంలో పరిస్థితుల్ని రెండు వారాల్లో చక్కదిద్దాలని డెడ్‌లైన్ విధించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ హరీష్ రావత్, సీనియర్ నేత జేపీ అగర్వాల్‌లతో కూడిన కమిటీ ఎదుట హాజరైన సీఎం అమరీందర్ సింగ్ తన వాదనని సమర్థంగా వినిపించినట్టు తెలుస్తోంది. సిద్ధూ వర్గం చేసిన ప్రతీ ఫిర్యాదుకి ఆయన కౌంటర్లు ఇచ్చినట్టుగా సీఎం వర్గం చెబుతోంది. సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి మాత్రం ఆయన ససేమిరా అంటున్నారు. మరోవై పు రాహుల్ గాంధీని కూడా పలువురు నేతలు కలుసుకొని రాష్ట్ర పరిస్థితుల గురించి వివరించారు.
రాజీ ఫార్ములా ?
సీఎంకి, సిద్ధూకి మధ్య రాజీ ఫార్ములా కుదిర్చే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ వివిధ సర్వేల్లో అట్టడుగు స్థానంలో ఉండడం ఆయనకు మైనస్‌గా మారితే, నవజోత్ సింగ్ సిద్ధూ బహిరంగంగానే సీఎంను తూలనాడడం ఆయనకు మైనస్‌గా మారింది. సిద్ధూ వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారడం కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతానికి సిద్ధూ çపక్షాన ఉన్నప్పటికీ ఎంతవరకు పార్టీలో ఆయనను కాపాడగలరన్న సందేహాలైతే ఉన్నాయి. అమరీందర్ ఢిల్లీకి వచ్చినప్పటికీ సోనియా, రాహుల్‌ల అపాయింట్‌మెంట్ ఆయనకు దొరకలేదని చెబుతున్నారు. సిద్ధూ లేవనెత్తిన పలు అంశాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎంను ఆదేశించింది. తద్వారా సిద్ధూని బుజ్జగించినట్లు అవుతుందని, ప్రజల కోసం మాట్లాడానని, సమస్యలు పరిష్కరించగలిగానని ఆయన చెప్పుకోవడానికి వీలుంటుందని భావిస్తోంది. ఇప్పటికే సిద్ధూని ఢిల్లీకి రమ్మని పిలవడంతో సోనియాగాంధీ వీరి ఇరువురి మధ్య సయోధ్య కుదురుస్తారని, ఎన్నికల వేళ ఎలాంటి మార్పులు చేపట్టినా మొదటికే మోసం వస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సీఎంపై సిద్ధూ వర్గం చేస్తున్న ఫిర్యాదులు
► కెప్టెన్ అమరీందర్ నేతృత్వంలో వచ్చే ఏడాది ఎన్నికలకి వెళితే కాంగ్రెస్ గెలిచే చాన్స్ లేదు
► అమరీందర్ సింగ్ అకాలీదళ్‌తో కలిసి రాష్ట్రంలో మాదక ద్రవ్య మాఫియాను పెంచిపోషిస్తున్నారు
► 2015లో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహిబ్‌ను అపవిత్రం చేసిన ఘటనల్లో, కాల్పుల్లో ఇద్దరు యువకులు చనిపోవడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవడంలో అమరీందర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
► ఇసుక, రవాణా మాఫియాలతో కుమ్మక్కై కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణాలు
► నిరుపేదల సంక్షేమ కార్యక్రమాల అమలులో వైఫల్యం
► ఉద్యోగులు, రైతులు, దళితులు, ఆశ వర్కర్లు సీఎంకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు.
అమరీందర్‌పై సిద్ధూ సిక్సర్లు
‘‘ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతారు. నేను ఆప్‌తో చేతులు కలుపుతున్నానని అంటున్నారు. దానికి ఆధారాలున్నా యా? ఏం మాట్లాడుతున్నారో ఆయనకేమైనా అర్థమవుతోందా? ఒక ముఖ్యమంత్రిగా అస లేం చేశారు? రిపోర్టు కార్డు ఇవ్వండి. అమరీం దరే అకాలీదళ్ చేతుల్లోకి వెళ్లిపోయారు’’
‘‘మీకు కావాలనుకుంటే ఎన్నికల ప్రచారానికి తీసుకువెళ్లి గెలిచిన తర్వాత నన్ను తిరిగి అల్మారాలో పెట్టేయడానికి నేనేమీ షో పీస్‌ని కాను. అందుకే మీ పని తీరుని నేను గమనిస్తూనే ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి, స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. ఇది నేను భరించలేను’’
‘‘ప్రశాంత్ కిశోర్ నన్ను 60 సార్లు కలుసుకున్నాకే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. గత ఎన్నికల్లో నేను 56 స్థానాల్లో ప్రచారం చేస్తే 54 సీట్లలో పార్టీ గెలిచింది. అప్పట్నుంచి నాకున్నది ఒక్కటే ఎజెండా. పంజాబ్ ప్రజల ఎజెండా. ఈ విషయాన్ని అప్పట్లోనే నేను స్పష్టం చేశాను. ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను’’
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment