శివాజీనగర: జమ్ముకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ వద్ద ఆకస్మిక వరదలు సంభవించి పలువురు మరణించడం తెలిసిందే. దీంతో యాత్రను రద్దు చేశారు. అమర్‌నాథ్ పర్యటనలో వంద మందికి పైగా కన్నడిగులు ఉన్నారు. వారి రక్షణకు చర్యలు తీసుకున్నట్లు సీఎం బసవరాజ బొమ్మై, రెవెన్యూ మంత్రి అశోక్ తెలిపారు. శనివారం సీఎం మాట్లాడుతూ కన్నడిగులు అందరూ క్షేమమని, ఎలాంటి అవాంఛనీయాలు జరిగినట్లు సమాచారం రాలేదన్నారు. 15–20 మంది ఫోన్ చేసి తాము ఇబ్బందుల్లో ఉన్నట్లు చెప్పగా, అక్కడి అధికారులతో మాట్లాడి సాయం చేయాలని కోరామన్నారు. సహాయం అవసరమైతే సహాయవాణికి కాల్ చేయాలన్నారు.
మైసూరు లాయర్లు సురక్షితం
మైసూరు: అమర్‌నాథ్ వరద విపత్తు నుంచి మైసూరు నగరానికి చెందిన న్యాయవాదుల బృందం కొంచెంలో తప్పించుకుంది. వరదలో చిక్కుకున్న తమను సైనికులు కాపాడినట్లు తెలిపారు. మైసూరు తాలూకాలో మరటి క్యాతనహళ్లికి చెందిన ఎ.జె.సుధీర్, గుంగ్రాల్ శివరామ్, ఎస్.రఘు, మైసూరువాసి జి.కే.జోషి, హెబ్బాలవాసి కే.టి.విష్ణు. లోకేష్, తిలక్, ప్రదీప్‌కుమార్ తదితరులు జూలై నెల 4 వ తేదీన అమర్‌నాథ్‌లో పరమశివుని గుహ దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఎగువన హిమాలయాల్లో ప్రచండమైన వరదలు రావడంతో గుహ వద్ద పెద్ద ప్రవాహం దూసుకొచ్చింది. కొండ చరియలు కూడాకొట్టుకొచ్చాయని తెలిపారు. ఇంతలో సైనికులు తమను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారని ఫోన్‌లో తెలిపారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్: 011–23438252, 011–23438253
కాశ్మీర్ హెల్ప్ లైన్: 0914–2496240
దేవాలయ పాలక మండలి సహాయవాణి:01914–2313149
కర్ణాటక కేంద్రం: 080–1070, 22340676
Comments
Please login to add a commentAdd a comment