చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఐటీ శాఖ మంత్రి కదంపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్‌పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్‌పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్‌పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment