Tamil Nadu: Army Helicopter Carrying Senior Defence Officers Crashes - Sakshi
Sakshi News home page

TN Army Helicopter Crash: కుప్పకూలిన బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌, 13 మంది మృతి

Published Wed, Dec 8 2021 1:36 PM | Last Updated on Thu, Dec 9 2021 9:59 AM

Army Helicopter Carrying Defence Officials Crashes in Tamil Nadu - Sakshi

Tamil Nadu Army Helicopter Crash Video: బుధవారం తమిళనాడు కూనూర్‌ సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత తొలి సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌) జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది దుర్మరణం చెందారు. 2019లో ఆయన సీడీఎస్‌గా నియమితులయ్యారు. డిఫెన్స్‌ వైఫ్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌(డీడబ్లు్యడబ్ల్యయే) అధ్యక్షురాలిగా మధులిక సేవలనందిస్తున్నారు. రావత్‌ మరణాన్ని భారత వైమానిక శాఖ(ఐఏఎఫ్‌) నిర్ధారించింది. పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీహెచ్‌ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైందని, దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారని, ఒక్కరు మాత్రమే గాయాలతో బయటపడ్డారని వైమానిక శాఖ ప్రకటించింది.

ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మాత్రమే బతికి బయటపడ్డారని,  ప్రస్తుతం వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడని తెలిపింది. మరణించినవారిలో ఐదుగురు హెలికాప్టర్‌ సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం వెల్లింగ్టన్‌లో మృతులకు నివాళి అర్పించిన అనంతరం వారి అవశేషాలను కోయంబత్తూర్‌ నుంచి ఢిల్లీకి వాయుమార్గంలో తీసుకుపోనున్నట్లు పోలీసు, రక్షణవర్గాలు తెలిపాయి. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

‘‘ దుర్ఘటనలో రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌ సహా 11 మంది మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నాం’’ అని వైమానిక శాఖ ట్వీట్‌ చేసింది. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ప్రసంగించేందుకు రావత్‌ రావాల్సిఉంది.  ఇదే కాలేజీలో రావత్‌ గతంలో విద్యాభ్యాసం   చేశారు. చదువుకున్న చోటికి వెళ్తూ మృత్యు ఒడిలోకి రావత్‌ చేరటం విధివైపరీత్యం. ప్రమాదంలో బతికిబయటపడ్డ వరుణ్‌ సింగ్‌ ఈ కాలేజీలో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు.

 
(చదవండి: త్రివిధ దళాలకు డీఆర్‌డీఓ వ్యవస్థలు)

మృతుల్లో రావత్, మధులికతో పాటు బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జిందర్‌ సింగ్, వింగ్‌ కమాండర్‌ పీఎస్‌ చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌ కే సింగ్, నాయక్‌ గురుసేవక్‌సింగ్, నాయక్‌ జితేందర్‌ కుమార్, లాన్స్‌నాయక్‌ వివేక్, లాన్స్‌ నాయక్‌ బీ సాయితేజ, హవల్దార్‌ సత్పాల్, జేడబ్ల్యయో దాస్, ప్రదీప్‌ ఉన్నారని అధికారులు చెప్పారు. వీరిలో సాయితేజ ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినవారు. బిపిన్‌కు భద్రతాధికారిగా పనిచేస్తున్నారు. బిపిన్‌ మరణంతో సైనిక దళాలు తీవ్ర విచారంలో మునిగిపోయాయి.

ఆయన వ్యూహాలను, సామర్థ్యాన్ని గుర్తు చేసుకున్నాయి. 2016–2019 కాలంలో ఆయన ఆర్మీ చీఫ్‌గా పనిచేశారు. అనంతరం రక్షణబలగాల ఉమ్మడి అధిపతిగా నియమితులయ్యారు. రావత్‌ మరణంపై ఆర్మీ చీఫ్‌ నరవణె, తదితర ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తం చేశారు. రావత్‌ నాయకత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆర్మీ ట్వీట్‌ చేసింది.  

సీసీఎస్‌ అత్యవసర సమావేశం 
రావత్‌ ప్రయాణిస్తున్న ఛాపర్‌ క్రాష్‌ అయిందన్న వార్త నేపథ్యంలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ(సీసీఎస్‌) సమావేశమైంది. ఇందులో ప్రధాని, రక్షణ; హోం, ఆర్థిక, విదేశాంగ మంత్రులతో పాటు కేబినెట్‌ సెక్రటరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పాల్గొన్నారు. సీసీఎస్‌ సభ్యులతో పాటు కేబినెట్‌ సభ్యులు రావత్‌ మరణంపై సంతాపాన్ని తెలియజేశారు. కొత్త సీడీఎస్‌గా ఎవరినైనా నియమిస్తారా? లేదా? అన్న విషయమై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రమాద వివరాలను రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్, ప్రధాని మోదీకి వివరించారు. ఐఏఎఫ్‌ చీఫ్‌ను సంఘటన స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. తదనంతరం రాజ్‌నాధ్‌ ఢిల్లీలోని రావత్‌ నివాసానికి వెళ్లి రావత్‌ కుమార్తెను పరామర్శించారు. రావత్‌ గొప్ప సైనికుడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. రావత్‌ మరణంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని ప్రకటించారు. ప్రమాద సంఘటనపై శుక్రవారం రాజ్‌నాధ్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు.

(చదవండి: కుప్పకూలిన హెలికాప్టర్‌.. నలుగురు దుర్మరణం)

ఇలా జరిగింది...
►ఢిల్లీ పాలం విమానాశ్రయం నుంచి రావత్‌ తదితరులు బుధవారం ఉదయం 9గంటలకు బయలుదేరారు.  
►ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూర్‌ సమీపంలోని సూలూర్‌ ఎయిర్‌బేస్‌కు చేరారు. 
►11.45 గంటలకు రావత్‌ తదితరులు ప్రయాణిస్తున్న ఛాపర్‌ సూలూర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి టేకాఫ్‌ అయింది. 45 నిమిషాల్లో వెల్లింగ్టన్‌లోని స్టాఫ్‌కాలేజీకి చేరాల్సిఉంది.  
►మధ్యాహ్నం సుమారు 12.20 గంటలప్రాంతంలో  ప్రమాదం జరిగినట్లు తెలియగానే ప్రమాదస్థలానికి 8 అంబులెన్సులు, వైద్య బృందాలు చేరుకున్నాయి.  
►నీలగిరి జిల్లాలోని కట్టెరి– నాన్చపంచత్రం ప్రాంతంలో ఛాపర్‌ కూలిపోయింది. స్థానికులు తొలుత ఈ ప్రమాదాన్ని గుర్తించారు.  
►పొగమంచు వాతావరణంలో ఛాపర్‌ బాగా కిందకు వచ్చిందని, కూనూర్‌ సమీపంలోని ఒక లోయలో కూలిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.  
►ఘటనా స్థలికి చేరేటప్పటికే మంటలు ఛాపర్‌ను ఆక్రమించాయని తెలిపారు.  
►కూలిపోయే సమయంలో ఒక ఇంటిని హెలికాప్టర్‌ గుద్దుకుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.  
►ఛాపర్‌ నుంచి ఇద్దరు వ్యక్తులు పడిపోయారని ప్రత్యక్ష సాక్షి పెరుమాళ్‌ చెప్పారు. ప్రమాద ప్రాంతంలోని చెట్లు ధ్వంసం అయ్యాయి.  
►ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు స్థానికులు యత్నించినా ఉపయోగం లేకపోయింది.  
►ప్రమాద స్థలంలో భారీగా మంటలు చెలరేగాయి, పరిసరాల్లోని చెట్లుచేమా తగలబడ్డాయి. వీటిని ఆర్పేందుకు అక్కడివారు యత్నించారు.  
►మంటలు అదుపులోకి వచ్చాక చూస్తే ప్రయాణీకులు మరణించినట్లు తెలిసింది.  
►గుర్తు తెలియని విధంగా దేహాలు కాలిపోవడంతో డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి మృతులను నిర్ధారించారు.  
►మధ్యాహ్నం 1.53 గంటలకు రావత్‌ మరణాన్ని ఐఏఎఫ్‌ అధికారికంగా ధృవీకరించింది.  
►సాయంత్రం 6.03 గంటలకు మరణవార్తను ఐఏఎఫ్‌ ప్రకటించింది.

ఉలిక్కిపడ్డ పశ్చిమ కనుమలు 
ఆర్మీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రావత్‌ పయనిస్తున్న హెలికాప్టర్‌ కూలిన దుర్ఘటనతో పశ్చిమ కనుమలు ఉలిక్కిపడ్డాయి. నీలగిరి జిల్లాలోని తేయాకు తోటల్లోని కార్మికులు తొలిసారి ఈ దుర్ఘటనను గుర్తించారు. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద ధ్వని వినిపించడాన్ని గమనించారు. చప్పుళ్లు ఏదో ప్రమాదానికి సంకేతమని గుర్తించి వెంటనే సంఘటనా స్థలాన్ని వెతుకుతూ వెళ్లారు. అప్పటికింకా ఆ ప్రాంతంలో కొంత పొగమంచు ఉంది. అక్కడకు వెళ్లాక భగభగలాడే మంటలు, లోహవస్తువులు విరిగిపోతున్న ధ్వనులను గుర్తించి నివ్వెరపోయారు. ప్రమాదం జరిగిందని స్థానికులు సాయం చేసేందుకు తయారయ్యారు. పెద్ద మంటల కారణంగా సంఘటన స్థలం దగ్గరకు పోలేకపోయారు. దాదాపు అరగంట పాటు మంటలు చెలరేగుతూనే ఉన్నాయని సాక్షులు చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement