
ముంబై: కరోనా వల్ల పండగల రూపు రేఖలే మారిపోతున్నాయి. అసలే వినాయక చవితి పండగ దగ్గర్లో ఉంది. కానీ ఈ సారి గణేశుని పండగ ప్రతి ఏడాదిలా కాకుండా పూర్తి భిన్నంగా జరగనుంది. పెద్ద హడావుడి లేకుండా, జన సమూహాలను ఎక్కువ సేపు గుమిగూడనీయకుండా నిశ్శబ్ధంగా పూజా ప్రసాద కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే విఘ్న నాయకుడు ప్రజల రక్షణ కోసం శానిటైజర్ ప్రసాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందో కళాకారునికి. అనుకున్నదే తడవుగా శానిటైజర్ వినాయకుడిని తయారు చేశాడు. ఈ విగ్రహం ముందుకు వెళ్లిన భక్తులు చేయి చాచగానే వారిపై శానిటైజర్ పడేలా రూపొందించాడు. ముంబైకి చెందిన కళాకారుడు నితిన్ రామ్‌దాస్ చౌదరి రూపొందించిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. (తుది మెరుగుల్లో ధన్వంతరి గణపతి)
ప్రతి ఏడాది ఆయన భిన్న గణేశుని ప్రతిమలను రూపొందిస్తాడు. ఈ సారి కరోనా కాలం నడుస్తుండటంతో అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శానిటైజర్ డిస్పెన్సర్ ప్రతిమను తయారు చేశాడు. ఈ విగ్రహాలు తయారు చేయడానికి దేశం నలుమూలల నుంచి ముడిసరుకును తీసుకొస్తానంటున్నాడు. అలాగే ఈ శానిటైజర్ వినాయకుడి ప్రతిమలో లైట్లు కూడా పొందుపరిచానని తెలిపాడు. వీటిని రిమోట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నాడు. "గణేశుడు మన సమస్యలను పటాపంచలు చేస్తాడని బలంగా విశ్వసిస్తాం. అందుకే ఆ దేవుని ఆయుధంగా శానిటైజర్‌ను ప్రతిమలో పొందుపరిచా. ఇది మన నుంచి వైరస్‌ను పారద్రోలుతుందనడానికి సూచిక" అని తెలిపాడు. (‘ముఖానికి మాస్కు లేదా.. అయితే ఈ యంత్రం పెట్టేస్తుంది’)
Comments
Please login to add a commentAdd a comment