![Arvind Kejriwal Announces Rs 5000 for Autorickshaw And Taxi Drivers - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/4/kejriwal.jpg.webp?itok=ff8He2oY)
ఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కొనసాగుతోంది. తొలుత వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించగా.. మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో మరి కొద్ది రోజులు పొడగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలను ఆదుకుంటామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పేదలకు రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీలోని 72 లక్షల రేషన్ కార్డుదారులకు రాబోయే రెండు నెలల పాటు ఉచితంగా రేషన్ అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా రేషన్ ఉచితంగా అందజేస్తామని, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ తెలిపారు. 2 నెలల పాటు రేషన్ ఉచితంగా ఇస్తామంటే.. లాక్‌డౌన్ రెండు నెలలు కొనసాగుతుందని అనుకోవద్దని స్పష్టతనిచ్చారు.
అలాగే, ఢిల్లీలోని ఆటోరిక్షాలు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5,000 ఆర్ధిక సాయం ప్రకటించారు. కరోనా కాలంలో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటున్న డ్రైవర్లు ప్రతి ఒక్కరికీ ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. రోజుకు పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు జరపడం కూడా కష్టతరంగా మారింది. శ్మశనాల్లో సామర్థ్యానికి మించి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అంత్యక్రియల కోసం రెండు మూడు రోజులు నీరిక్షించే పరిస్థితి నెలకొంది.
చదవండి: సీఎంలకు కేజ్రివాల్ లేఖ: ప్లీజ్ మాకు ఆక్సిజన్ పంపండి
Comments
Please login to add a commentAdd a comment