రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్
15దాకా జ్యుడీషియల్ కస్టడీ
జైలు వద్ద ఆప్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ విధానంలో అక్రమాల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ కోర్టు ఈనెల 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 21న ఈడీ అరెస్ట్‌చేశాక మార్చి 28వ తేదీదాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీచేయడం తెల్సిందే. తమ విచారణలో కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించట్లేడని, మరికొంతకాలం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం, అందుకు కోర్టు సమ్మతిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీదాకా కస్టడీని పొడిగించడం తెల్సిందే.
ఏప్రిల్ ఒకటిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయనను జడ్జి బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారణకు సహకరించని ఆయనను 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు వాదించారు. ఈ వాదననతో ఏకీభవిస్తూ ఏప్రిల్ 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. కేజ్రీవాల్‌ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచి్చనపుడు ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత అక్కడికొచ్చారు. ‘‘ కస్టడీలో ఈడీ 11 రోజులపాటు ప్రశ్నించింది.
ఇంక ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. ఆయనను ఇంతవరకు కోర్టు దోషిగా ప్రకటించలేదు. మరి అలాంటపుడు జైలుకు ఎందుకు పంపించారు?. లోక్‌సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయనను జైలుకు పంపింది’’ అని సునీతా ఆరోపించారు. పార్టీలో సునీతా అత్యత ‘క్రియాశీలక’ పాత్ర పోషించనున్నట్లు ఆప్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆదివారం ఢిల్లీలో రాంలీలా మైదాన్‌లో విపక్షాల ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో పాల్గొనడం ద్వారా సునీతా ఒక రకంగా రాజకీయ అరంగేట్రం చేసినట్లేనని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
‘‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో కేజ్రీవాల్ కీలక పాత్రధారి. లబ్ధిదారులకు లాభం చేకూరేలా మద్యంపాలసీ రూపకల్పన, అమలులో ఈయన ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం పాలసీని అమలుచేయకముందే క్విడ్ ప్రో ద్వారా తమకు రావాల్సిన నగదును కిక్‌బ్యాక్ రూపంలో పొందారు’’ అని ఈడీ తన రిమాండ్ దరఖాస్తులో ఆరోపించింది.
మూడు పుస్తకాలు, ఔషధాలు, లాకెట్..
జడ్జి ఉత్తర్వుల అనంతరం కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తున్నారన్న వార్త తెలిసి ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తిహార్ జైలుకు చేరుకుని ‘నేనూ కేజ్రీవాల్’ అని టీ–షర్ట్‌లు ధరించి, ఆప్ జెండాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. రెండో నంబర్ జైలులో కేజ్రీవాల్‌ను ఉంచే అవకాశముంది. వైద్య పరీక్షలు చేస్తున్నాం. తర్వాత ఆయనను ఒంటరిగా ఒక గదిలో ఉంచునున్నారు. గదిలో ప్రతిరోజూ 24 గంటలపాటు సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగనుంది. అనారోగ్యం దృష్ట్యా సంబంధిత ఔషధాలు, ప్రత్యేక ఆహారాన్ని ఆయనకు అందించనున్నారు. మతవిశ్వాసాన్ని గౌరవిస్తూ ఒక లాకెట్ ధరించేందుకు ఆయనకు అనుమతి లభించింది. భగవద్గీత, రామయణం, నీరజా చౌదరి రాసిన ‘ హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాలనూ అనుమతించారు.
ఉదయం ఆరున్నరకు దినచర్య మొదలు
కేజ్రీవాల్ దినచర్య మిగతా విచారణఖైదీల్లాగే ఉదయం ఆరున్నర గంటలకు మొదలుకానుంది. ఉదయం చాయ్, బ్రెడ్ అల్పాహారంగా ఇవ్వనున్నారు. కోర్టులో కేసు విచారణ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు. లేదంటే 10.30 నుంచి 11 మధ్యలో లంచ్ వడ్డిస్తారు. పప్పు, కూరగాయలు లేదంటే ఐదు చపాతీలు లేదా అన్నం వడ్డిస్తారు.తర్వాత మూడు గంటల దాకా గదిలోనే ఉంచుతారు. మూడున్నరకు టీ, బిస్కెట్లు అందిస్తారు. నాలుగు గంటలకు తమ లాయర్లను కలిసేందుకు అనుమతిస్తారు. 5.30గంటలకే డిన్నర్ వడ్డిస్తారు. ఏడింటికల్లా గదికి పంపించి తాళం వేస్తారు.
టీవీ సదుపాయం కల్పిస్తారు. వైద్య, సహాయక సిబ్బంది 24 గంటలూ అందుబాటులోఉంటారు. వారానికి రెండుసార్లు కుటుంబసభ్యులను కలవొచ్చు. ఆప్ నేత సంజయ్ సింగ్‌ను గతంలో ఈ సెల్‌లోనే ఉంచారు. ఇటీవల ఐదో నంబర్ జైలుకు మార్చారు. ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఒకటో నంబర్ జైలులో, బీఆర్‌ఎస్ నేత కె.కవితను ఆరో నంబర్ మహిళా జైలులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment