
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి లా, కామర్స్ డిగ్రీ పొందారు.
స్వామి అగ్నివేశ్ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.