అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించడానికి దేశవిదేశాలను నుంచి రామ భక్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అయోధ్యకు ప్రతి ఏడాది వందల సంఖ్యలో దక్షిణ కొరియా దేశపు సందర్శకులు వస్తుంటారు. అయితే వారంతా వచ్చేది.. రామ జన్మభూమిని దర్శించుకోవడానికి వచ్చినవారు అయితే కాదు? మరి వారంతా అయోధ్యకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే...
దక్షిణ కొరియాకు ఉత్తరప్రదేశ్‌లోని రాముడు పుట్టిన అయోధ్యకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. అయితే ఈ సంబంధం రాముడితో కాదు. ప్రతి ఏటా వందల మంది దక్షిణ కొరియన్లు రాణి హు హ్వాంగ్ ఓకేకు నివాళులు అర్పించడానికి అయోధ్య నగరాన్ని సందర్శిస్తారు. అయోధ్యతో తమకు పూర్వకాలపు సంబంధాలు ఉన్నట్లు దక్షిణ కొరియన్లు నమ్ముతున్నారు. దక్షిణ కొరియా ఇతిహాసాల ప్రకారం.. రాణి సూరిరత్న అని పిలువబడే క్వీన్ హు హ్వాంగ్ ఓకే దక్షిణ కొరియాకు వెళ్లక ముందు అయోధ్య యువరాణి. క్రీ.శ 48లో కరక్ వంశానికి చెందిన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారని దక్షిణ కొరియన్లు నమ్ముతారు.
డాక్టర్ ఉదయ్ డోక్రాస్ పరిశోధనా ప్రకారం సుంగుక్ యుసా రాజు అయిన సురో అయుత రాజ్యానికి చెందినవారని తెలుపుతోంది. అప్పటి ‘అయుత’నే ప్రస్తుత అయోధ్య అని వివరించబడింది. అయితే దక్షిణ కొరియా రాణి స్మరకం 2001లో అయోధ్యలో ప్రారంభించారు. 2015లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ రాణి స్మారకం విస్తరణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకాన్ని సుందరంగా తీర్చిదిద్ది 2022లో ప్రారంభించారు. ఇక రాణి హు హ్వాంగ్ ఓకే స్మారకంగా 2019లో భారత్ ప్రభుత్వం రూ. 25, రూ.5 పోస్టల్ స్టాంపులు విడుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ టూరిజం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. కరక్ వంశానికి చెందిన 60 లక్షల మంది ప్రజలు అయోధ్యను తమ మాతృభూమిగా భావిస్తారని తెలుస్తోంది. చిన్న వయసులో రాణి సూరిరత్న పడవలో కొరియాకు చేరుకుందని, ఆమెకు 16 ఏళ్ల వయసులో వివాహం అయినట్లు కొరియా ప్రజలు నమ్ముతారని తెలుపుతోంది. మరోవైపు చైనా గ్రంథాల ప్రకారం.. అయోధ్యను పరిపాలించే రాజు తన 16 ఏళ్ల కూతురును దక్షిణ కొరియాకు చెందిన రాజు కిమ్ సూరోతో వివాహం జరిపించడానికి ఆమెను దక్షిణ కొరియాకు పంపాలని అతనికి కల వచ్చినట్లు ప్రచారంలో ఉంది. వారికి 10 మంది పిల్లలు పుట్టారని, వీరు 150 ఏళ్లు జీవించి ఉన్నారని చైనా గ్రంథాల్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
2020లో దక్షిణ కొరియా రాయబారి బాంగ్ కిల్.. అయోధ్యకు కొరియాతో ప్రత్యేకమైన సంబంధాలు ఉన్నాయని అన్నారు. కొరియా పురాతన చరిత్ర గ్రంథాల్లో అయోధ్యకు చెందిన యువరాణి కొరియన్ రాజును వివాహం చేసుకున్నట్లు రాసి ఉందని తెలిపారు. రాజు కిమ్ సురో సమాధికి సంబంధించిన పురావస్తు పరిశోధనల్లో అయోధ్యకు చెందిన కళాఖండాలు బయటపడ్డాయనిపేర్కొన్నారు.
రాణి సూరిరత్న పార్క్ ప్రత్యేకతలు..
►అయోధ్యలోని క్వీన్ హు హ్వాంగ్ ఓకే స్మారక పార్క్.. అయోధ్య నుంచి కొరియా వరకు యువరాణి సూరిరత్న ప్రయాణాన్ని కళ్లకుకట్టినట్లు ప్రతిబింబిస్తుంది.
►దక్షిణ కొరియా నుంచి రవాణా చేయబడిన రాతి నిర్మాణంపై పురాతన విషయాలు చెక్కారు.
►రూ. 21 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సరయు నది ఒడ్డున ఈ పార్క్ నిర్మించారు.
►స్మారక చిహ్నం యొక్క ఆగ్నేయ దిశలో క్వీన్ హు హ్వాంగ్ ఓక్ విగ్రహం ఉంది.
►ఈశాన్య దిశలో రాజు కిమ్ సురో విగ్రహం ఏర్పాటు చేశారు.
►పార్కులో గ్రానైట్‌తో చేసిన గుడ్డు ఆకారం ఉంటుంది. యువరాణి సూరిరత్న కొరియాకు తన ప్రయాణంలో బంగారు గుడ్డును తీసుకువెళ్లిందని కొరియన్లు నమ్ముతారు.
Comments
Please login to add a commentAdd a comment