
గాంధీజీ 1915లో దక్షిణాఫ్రికా నుండి భారత్‌కు వచ్చాక, భారతదేశ పర్యటన ప్రారంభించారు. దానిలో భాగంగా చంపారన్ నీలి రైతులను దర్శించి వారికి పరిష్కారాన్ని చూపించారు. చంపారన్.. రాజర్షి జనకుని భూమి. చంపారన్‌లో మామిడి తోటలు వున్నట్లే, నీలిమందునూ ఉత్పత్తి చేస్తూ ఉండేవారు. బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం రావడం వల్ల బ్రిటన్ వారికి నీలిమందు అవసరం పడింది. చంపారన్ రైతులు తమ భూమిలో 3/20 వంతు భాగంలో తప్పనిసరిగా తమ తెల్ల యజమాని కోసం నీలిమందును చట్టరీత్యా ఉత్పత్తి చేయవలసి వచ్చేది. దీన్ని ‘తీన్ కఠియా రివాజు’ అని పిలిచేవారు. ఈ విషయంలో నీలి రైతులు తమ బాధలను గాంధీజీకి స్వయంగా విన్నవించుకున్నారు.
రివాజుపై పోరాటం
రాజ్ కుమార్ శుక్లా బీహార్‌లోని చంపారన్‌కు చెందిన రైతు. ఆయన తీన్ కఠియా వల్ల బాధలు పడ్డాడు. ఆ నీలిమచ్చను రైతులందరి హృదయాల నుండి తొలగించి వేయాలనే అగ్ని అతని హృదయంలో రగుల్కొంది. లక్నో కాంగ్రెసు మీటింVŠ లో గాంధీజీని కలుసుకుని చంపారన్ కథ వినిపించాడు. కానీ గాంధీజీ తాను స్వయంగా చూస్తే గానీ నమ్మరు కాబట్టి ఆయన చంపారన్ వెళ్లారు. ‘‘అణగారి పోయి భయభ్రాంతులై వున్న రైతు సోదరుల్ని కచేరీలు చుట్టూ తిప్పితే లాభం లేదు, అది సరైన చికిత్స కాదు, వాళ్లలో భయాన్ని పోగొట్టాలి’’ అని గాంధీజీ అక్కడి న్యాయవాదులను సున్నితంగా మందలించారు. ‘తీన్ కఠియా రద్దు కావాలి, అప్పటి వరకూ మనం విశ్రమించకూడదు’ అని కూడా అన్నారు గాంధీజీ.
గాంధీజీకి నోటీసులు
చంపారన్ బీహార్‌లో గంగానదికి ఆవలి వడ్డున, హిమాలయ పర్వత చరియల్లో నేపాల్‌కు దగ్గరగా వున్న ప్రాంతం. పరిపాలనా పరంగా చంపారన్ తిరుహాత్ కమీషన్‌లోని ఒక జిల్లా. దానికి ‘మోతీహార్‘ ప్రధాన కేంద్రం. అక్కడి నీలి మందు రైతులు నిరుపేదలు. ఆ ప్రాంతంలోనే బేతియాకు దగ్గర్లో రాజ్ కుమార్ శుక్లా ఇల్లు వుంది. ఆ దగ్గర్లోనే కస్తూరిబా గాంధీ ‘బితిహారమా’ గ్రామంలో పాఠశాలను నడపడం మొదలుపెట్టారు. ఈ దంపతుల ప్రోద్బలంతో ఆ ప్రాంత రైతులు తిరగబడతారేమోననే భయంతో ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.
‘మీరు సెక్షన్ 144ను ఉల్లంఘించారు గనుక రేపు కోర్టుకు హాజరు కమ్మని’ గాంధీజీకి సమన్లు పంపారు జిల్లా అధికారులు. గాంధీజీ ఎవరో తెలియకపోయినా చంపారన్‌లో ప్రజలు వార్త విని తండోప తండాలుగా కోర్టు ఆవరణ లోనికి వచ్చారు. పోలీసులకు వారిని అదుపు చేయడం కష్టమయ్యింది. గాంధీజీ ‘నా అపరాధమును అంగీకరిస్తున్నాను‘ అన్నారు మెజిస్ట్రేట్‌తో. ‘ నాకిచ్చిన ఆదేశాన్ని పాటిస్తే నేను ప్రజలకు న్యాయం చేయలేను, అందుకే చంపారన్ విడిచి వెళ్లలేను’ అని కూడా అన్నారు గాంధీజీ. అదే విషయాన్ని భారత వైస్రాయ్‌కూ ఇతర ఉన్నత అధికారులకూ, శ్రీ మదన మోహన మాలవ్యకూ తంతి ద్వారా తెలియజేసారు గాంధీజీ. చివరికి ‘తీన్ కఠియా రివాజు’ రద్దయింది.
తీన్ కఠియా రద్దుకు పోరాడుతున్న సమయంలోనే.. చంపారన్ గ్రామాల్లో విద్యా, వైద్య ప్రచారం జరిగితే గానీ ఆ గ్రామాలు బాగుపడవనే నిర్దారణకు గాంధీజీ వచ్చారు. పిల్లలు చదువులు లేకుండా తిరుగుతుండేవారు. పురుషులకు కూలి పది పైసలు, స్త్రీలకు ఆరు పైసలు, పిల్లలకు మూడు పైసలు. సహచరులతో చర్చించి మొదట ఆరు గ్రామాల్లో పాఠశాలలు నెలకొల్పారు. ఉపాధ్యాయుల విషయంలో వారికి చదువు రాకపోయినా పరవాలేదు కానీ శీలవంతులై వుండాలని గాంధీజీ గట్టిగా చెప్పారు.
వాలంటీర్లకు పిలుపు
గాంధీజీ స్కూలు నడపడానికి వాలంటీర్లు కావాలని ప్రకటించారు. ఆ ప్రకటనకు స్పందించి బాబా సాహెబ్ సామణ్, పుండలీక, అవంతికా బాయి గోఖలే, దక్షిణాది నుండి ఆనందీ బాయి, మహాదేవ్ దేశాయ్ భార్య దుర్గాబెన్, నరహరి ఫరేఖ్ భార్య మణి బెన్, కస్తూరి బాయి, దేవదాసు గాంధీ లు ఉపాధ్యాయులుగా వచ్చి చేరారు. మొదటి తరగతిలో అంకెలు నేర్పమని, నడవడిక నేర్పమని, రాయడం, చదవడం కంటే వారికి పారిశుద్ధ్యం గురించి చెప్పాలని గాంధీజీ ‘పాఠ్యాంశాన్ని’ నిర్థారించారు. గాంధీజీ కి చదువుతో తృప్తి కలగలేదు. గ్రామాల్లో మురికి అధికంగా వుంది, గ్రామం వీధుల్లో పెంటకుప్పలూ, బావుల దగ్గర బురద, దుర్వాసన, ఇళ్ల ముందు భరించలేని పరిస్థితులు వున్నాయి. పెద్దలు కూడా పారిశుద్ధ్యాన్ని గరపడం అవసరమని భావించారు. చంపారన్ ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, ఇందుకు డాక్టర్ సహాయం అవసరం కాబట్టి గోఖలే సొసైటీ కి చెందిన డాక్టర్ దేవ్ ను రప్పించారు. డా. దేవ్ రోగుల్ని చూడటమే కాదు, మిగతా వాలంటీర్లతో కలసి ఒక గ్రామం వీధులు శుభ్రం చేశారు. పెంట కుప్పలు ఎత్తివేశారు. బావి దగ్గర గల గుంతల్ని మట్టితో పూడ్చారు, పారిశుధ్యం ఈ విధంగా కొనసాగితే పెద్ద పెద్ద డాక్టర్లు అవసరం పడదని బోధించారు.
కస్తూర్బాతో చెప్పించారు
బీతిహరుమాలో స్త్రీల బట్టలు చాలా మురికిగా వున్నాయి. ఆ మహిళల్ని బట్టలు ఉతుక్కోమని, బట్టలు మార్చుకోమని చెప్పమని కస్తూరిబా తో చెప్పించారు గాంధిజీ. బట్టలు లేనివాళ్లకు బట్టలు తెప్పించారు. ఆ విధంగా గాంధీజీ దంపతులు చంపారన్‌లో వారియర్‌లై చైతన్యం తేగలిగారు.
– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యులు
Comments
Please login to add a commentAdd a comment