దేశాల మధ్య ఘర్షణ తాత్కాలికం, వాణిజ్య తదితర బంధాలు శాశ్వతం. ఇందుకు నిదర్శనమే.. సరిహద్దు వివాదానికి శాశ్వతంగా పరిష్కారం దొరక్కపోయినప్పటికీ భారత్, చైనా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతూ ఉండటం. భారత్, చైనాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు అసాధారణ స్థాయిలో పెరుగుతూ వస్తున్నప్పటికీ వీటి నుంచి భారతదేశం పెద్దగా లాభపడుతున్నదేమీ లేదన్న పెదవి విరుపు ఉంది. చైనా నుంచి మనం కొనుగోలు చేస్తున్న సరకుల కంటే మనం చైనాకు అమ్మగలుగుతున్న సరకుల పరిమాణం చాలా తక్కువ అన్నమాట కూడా అబద్ధమేమీ కాదు.
అయితే ఈ వ్యత్యాసాన్ని సమతుల్యం చేసేందుకు భారత్ కృషి చేస్తోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్‡్ష వర్ధన్ ష్రింగ్లా ధీమాగానే చెబుతున్నారు. వచ్చే పాతికేళ్లలో భారతదేశం తనకు సాధ్యమైన ప్రతిదీ ఎగుమతి చేయడానికి ప్రణాళికలు వేస్తోంది. మన ఎగుమతులను అత్యంత లాభదాయకంగా, గరిష్టంగా ఉత్తమమైన ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అత్యంత చౌకగా లభిస్తాయనుకున్న దేశాల నుంచి మనం సరకులను దిగుమతి చేసుకోడానికీ సిద్ధంగా ఉంది. చైనాకు భారత ఉత్పత్తులు ప్రధానంగా ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలకు సంబంధించినవే ఎగుమతి అవుతుంటాయి. అంటే మిగతా వాటిలో మనం స్వావలంబనను సాధించేంతవరకు భారత్, చైనా వాణిజ్యం కొనసాగుతూనే ఉంటుంది. గత వందేళ్లుగా చైనీయులు భారత్‌లో నివసిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో వేలాదిమంది చైనా పౌరులు నివసిస్తూ ఉన్నారు. వారిలో అన్ని రంగాల నిపుణులూ ఉంటారు. వారి సేవల్ని కూడా భారత్ గుర్తించి, వినియోగించుకోడానికి సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment