
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఏడాదిగా మనం స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్రోద్యమ యోధులను స్మరించుకుంటూ వస్తున్నాం. వారిలో శిఖర సమానులు మహాత్మాగాంధీ. ఇవి అమృతోత్సవాలు కనుక అయనను అమృతమూర్తి అనడం సబబు. ఆయన హిందూ–ముస్లిం ఐక్యతను; బడుగు, అణగారిన వర్గాల, కులాల, సమాజాల దాస్య విముక్తిని కోరుకున్నారు. సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని, సమానత్వాన్ని అభిలషించారు. గాంధీ సిద్ధాంతాలలో నేడు ఉదాసీనతకు గురైన అంశాలలో ఒకటి పర్యావరణ సుస్థిరత కూడానని అనిపిస్తుంది.
గాంధీ జీవించి ఉన్న కాలంలో వాతావరణ మార్పు అనేది ఆందోళన చెందవలసిన ఒక విషయమే కాదన్నట్లుండేది. అయితే పర్యావరణ అత్యవసర స్థితికి వాతావరణ మార్పు ఒక వాస్తవమైన లక్షణమన్నది నేటి ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది. భూగోళానికి పొంచి ఉన్న పర్యావరణ సంక్షోభాన్ని గాంధీజీ ఆనాడే తన విస్మయపరిచే శాస్త్రీయ దృక్పథంతో చాలా ముందుగానే వీక్షించారు. గాంధీ సందేశం నేటికీ ఔచిత్యాన్ని, అత్యవసరతను కలిగి ఉంది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకుంటున్న వేళ గాంధీజీ లోతైన ఆలోచనలు సమకాల ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రను పునర్నిర్మించడంలోని ఈ అత్యంత విలువైన గాంధీ విలువల వారసత్వం వెయ్యేళ్లయినా కొనసాగుతూనే ఉండాలి.