సాంకేతిక పరిజ్ఞానాన్ని చిన్న, సన్నకారు రైతుల వద్దకు తీసుకెళ్లాలన్న కురియన్ ఆలోచనను 1978లో ఎఫ్.ఎ.ఓ. తోసిపుచ్చింది. పాల ఉత్పత్తులపై లాభాలు గడించడం కార్పోరేటర్లకే పనికొస్తుందని ఆ సంస్థ వాదన. చిన్న కమతాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం సాధారణ విషయం కాదని నిరుత్సాహ పరిచారు. అయితే వాళ్లెవరూ కురియన్‌ను ఆపలేకపోయారు. చివరకు కురియన్ ఆచరణలో పెట్టిన అసాధారణ ఆలోచన ఫలితంగా జాతీయ పాల ఉత్పత్తుల అభివృద్ధి బోర్డు (ఎన్.డి.డి.బి) భారతదేశ పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది.
పాల ఉత్పత్తుల వార్షిక అభివృద్ధి రేటును 0.5 శాతం నుంచి 5 శాతానికి తీసుకెళ్లింది. 1998 నాటి కల్లా ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం అవతరించింది. అమెరికాలో చదువుకుని పట్టా సాధించిన కురియన్ 1949 మే నెలలో కొంత అయిష్టంగా గుజరాత్‌లోని ఆనంద్ కు వెళ్లారు. అయితే ఆ తరువాత ఆయన సాధించిన విజయాలు, సృష్టించిన చరిత్ర అందరికీ తెలిసినవే. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్య ఏర్పాటుకు 1973లో ఎన్.డి.డి.బి. సహాయం చేసింది. అమూల్, సాగర్ లాంటి బ్రాండ్‌ల పేర్లతో సహకార పాల సంఘాలు అందించే పాల ఉత్పత్తుల అమ్మకానికి తోడ్పడటం కోసం అది ఏర్పాటైంది.
భారతదేశ సరికొత్త ఆర్థిక విధానాల్లోని భ్రాంతుల పైన అందరి దృష్టి పడేలా చేసేందుకు కురియన్ ఎప్పుడూ కృషి చేస్తూ వచ్చారు. ధనిక, బీద దేశాల మధ్య సహకారం, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలలో వ్యావసాయిక పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పడటం లాంటివి ఆయన ప్రపంచీకరణ దృక్పథంలో భాగాలు. ప్రపంచ వ్యాప్త క్షీర విప్లవం గురించి ఆయన కలలు కన్నారు. గ్రామీణులకు మరింతగా ఆదాయం కావలసి వచ్చిన సమయంలో మన భారతీయ క్షీర విప్లవకారుడైన కురియన్ అందుకు తగినట్లు చేయడం ప్రారంభించారు. కృషి, పట్టుదల వల్ల ఆయన అందరికీ ఆదర్శప్రాయుడయ్యారు.
– యోగిందర్ కె.అలఘ్, ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి
(చదవండి: మహోద్యమ వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment