ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌లో దేవుడుని దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులకు కష్టాలు తప్పడం లేదు. భారీ వర్షాలు, వరదలతో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. రోడ్లు, రహాదారులను అధికారులు ముందు జాగ్రత్తగా మూసేస్తున్నారు. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
చమోలీ జిల్లాలో బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారిపై ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. దీంతో భయభ్రాంతులకు గురైన అక్కడి ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు.హైవేపై కొండచరియలు విరిగిపడటంతో శిథిలాక కారణంగా రహదారిని అధికారులు మూసివేశారు. సుమారు 48 గంటల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
కాగా బద్రీనాథ్ హైవేను తిరిగి తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రహదారిపై పడిన శిథిలాలను కార్మికులు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం కార్మికులు పనిచేస్తుండగా పర్వతం నుంచి ఒక్కసారిగా బండరాళ్లు కిందపడ్డాయి. అయితే ఈ ప్రమాదం నుంచి కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. రాళ్లు జారడం చూసిన కార్మికులు కొండపైకి పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇక బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జోషిమఠ్ వద్ద రహదారిని క్లియర్ చేసేందుకు సుమారు 241 ఎక్స్‌కవేటర్లను అక్కడ మోహరించారు.
ఉత్తరాఖండ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం 260కి పైగా రోడ్లు మూసేశారు. . రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment