ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ డివిజన్‌లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?
అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.
బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.
బాంబీ బకెట్‌ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్‌గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్‌తో మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్‌లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment