బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్‌ను దారుణంగా చంపిన నిందితులు
కోల్‌కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్) విసిరి కోల్‌కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమెను శిలాంతి రెహమాన్‌గా గుర్తించారు. బంగ్లాదేశ్ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్ షహీన్‌కు ప్రియురాలు అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో అక్తరుజమాన్ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్ కోల్‌తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది.
మరో నిందితుడు అమానుల్లా అమన్‌తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అనర్‌ను బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అనర్, అఖ్తరుజమాన్ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు.
అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ
ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్‌ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్‌ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్‌కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్‌ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment