MP Congress Leader Arrested Over Be Ready To Kill Modi Remark - Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే కాంగ్రెస్‌ నేత అరెస్ట్‌

Published Tue, Dec 13 2022 9:40 AM | Last Updated on Tue, Dec 13 2022 10:26 AM

Be Ready To Kill Modi Remark MP Congress Leader Arrested - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ రాష్ట్ర మంత్రి రాజా పటేరియా అరెస్ట్‌ అయ్యారు. ప్రధాని మోదీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌ హోం శాఖ స్పందించింది. పటేరియా మీద కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పన్నాలోని పవాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నాం కేసు రిజిస్టర్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

ఆదివారం పన్నా జిల్లాలోని పవాయ్‌ పట్టణంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి సోమవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఇక త్వరలో మోదీ ఎన్నికల తంతుకు మంగళం పాడుతారేమో. భాష, కులం, మతం ప్రాతిపదికన జనాలను విడగొడతారు. రాజ్యాంగ నియమాలను కాలరాస్తూ దళితులు, గిరిజనులు, మైనారిటీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేస్తున్నారు. ఇకనైనా రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే మోదీని చంపేందుకు సిద్ధంకండి. చంపడమంటే ఓడించడమే’ అని పటేరియా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. సోమవారం ఆ వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది.

దీంతో మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా.. పటేరియాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని ఆదేశించారు. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు, దళితులు, మైనారిటీల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారంటూ పలు సెక్షన్ల కింద పవాయ్‌ పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదుచేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలను సీఎం శివరాజ్‌ సింగ్‌ సైతం తీవ్రంగా ఖండించారు.

ఇక ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించబోమని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ విభాగం సైతం ఖండించింది. అయితే.. ‘ నా ఉద్దేశం బీజేపీని, మోదీని ఓడించాలని. చంపాలని కాదు. నా వ్యాఖ్యలను వక్రీకరించారు’ అని తర్వాత పటేరియా వివరణ ఇచ్చారు.  అయినప్పటికీ కేసు నమోదు కావడంతో ఆయన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement