శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మాతా వైష్ణో దేవి(జమ్ము)
మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు.
అహ్మదాబాద్‌లో..
గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్‌ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్‌లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి.
వారణాసిలో..
వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్‌లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు.
కేరళలో..
కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లో..
నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్‌గఢ్‌లోని
దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment