celabration
-
గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్!
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) క్యాంప్‌లో మొత్తం 2,274 మంది క్యాడెట్లు పాల్గొననున్నారు. వీరిలో యువతుల భాగస్వామ్యం అధికంగా ఉండనుంది. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ ఈ వివరాలను తెలియజేశారు. ఎన్సీసీలో యువతుల భాగస్వామ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందని అన్నారు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శిబిరానికి హాజరవుతున్న క్యాడెట్లలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌కు చెందిన 122 మంది, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 177 మంది ఉన్నారని సింగ్ చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 45 మంది యువతుల బృందం తొలిసారిగా ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో పాల్గొంటున్నదన్నారు. వీరి బ్యాండ్ తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో అలరించనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ టీమ్, బెస్ట్ క్యాడెట్, హార్స్ రైడింగ్ మొదలైన పోటీలు నిర్వహించనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ సింగ్ తెలిపారు. కాగా 2023లో దాదాపు నెల రోజులపాటు జరిగిన ఎన్సీసీ శిబిరంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 710 మంది యువతులతో సహా మొత్తం 2,155 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో రక్షణ దళాలకు చెందిన రెండు మహిళా బృందాలు కవాతు చేయబోతున్నాయి. ఒక్కో బృందంలో 144 మంది మహిళా సైనికులు ఉండనున్నారు. వీరిలో 60 మంది ఆర్మీకి చెందిన వారు కాగా, మిగిలిన వారు భారత వైమానిక దళం, భారత నౌకాదళానికి చెందిన వారు ఉంటారని రక్షణ అధికారులు తెలిపారు. ఈ బృందంలో నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మహిళా అగ్నివీర్ సైనికులు కూడా ఉండనున్నారు. -
దీపావళిని ఏ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు? బెంగాల్ ప్రత్యేకత ఏమిటి?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు. పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్‌లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు. దక్షిణ భారతదేశంలో దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు. తూర్పు భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దీపావళినాడు కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
స్వాతంత్య్రానంతరం కశ్మీర్ శక్తిపీఠంలో నవరాత్రులు
కశ్మీర్‌ను భూతల స్వర్గం అంటారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఎవరైనా ఇట్టే ఆకర్షితులవుతారు. అయితే ఇక్కడ వేళ్లూనుకున్న వేర్పాటువాదం దశాబ్దాలుగా లోయను కట్టుబాట్లకు గురిచేసింది. అయితే భారత సైనికుల త్యాగం, ధైర్యసాహసాల కారణంగా ఇప్పుడు లోయలో ప్రశాంతత నెలకొంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు తొలిసారిగా శారదా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఓకే నుండి కేవలం 500 మీటర్ల దూరంలోని కుప్వారా పరిధిలోని టిట్వాల్ గ్రామంలో శారదామాత ఆలయం ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఈ ఆలయంలో నవరాత్రి పూజలు ఎప్పుడూ నిర్వహించలేదు. అయితే ప్రస్తుతం ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం శతాబ్దాల క్రితం నాటిదని చెబుతారు. ఈ ఆలయం దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రస్తుతం కశ్మీర్లో టూరిజం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. దీంతో రానున్న రోజ్లులో కుప్వారాలోని ఈ దేవాలయానికి మరింత ఆదరణ దక్కనున్నదని స్థానికులు అంటున్నారు. కశ్మీర్ ఒకప్పుడు దేశానికి ఆధ్యాత్మికత రాజధాని. ప్రపంచం నలుమూలల నుండి ఆధ్యాత్మిక అభిరుచిగలవారు ఇక్కడ సమావేశం అయ్యేవారు. అందుకే ఇక్కడ ఎన్నో గొప్ప దేవాలయాలు నిర్మితమయ్యాయని చెబుతారు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్న శారదామాత దేవాలయం మొదటి శతాబ్దంలో కుషాణుల సామ్రాజ్య కాలంలో నిర్మితమయ్యింది. ఇప్పటికీ ఇక్కడ అనేక దేవాలయాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ దేవాలయాలను పునరుద్ధరించే పనిలో పడింది. ఇది కూడా చదవండి: యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్‌తో సంబంధం ఏమిటి? -
గుజరాత్ నవరాత్రుల ప్రత్యేకత ఏమిటి? వైష్ణోదేవి దర్శనానికి ఎంతసేపు వేచివుండాలి?
శరన్నవరాత్రులు దేశంలోని తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అన్నిచోట్లా వైభవంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో దుర్గా మండపాలను అందంగా అలంకరిస్తారు. మరికొన్ని చోట్ల దాండియా నైట్ నిర్వహిస్తారు. దేశంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ప్రాంతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాతా వైష్ణో దేవి(జమ్ము) మాతా వైష్ణో దేవి ఆస్థానంలో ఏడాది పొడవునా భక్తుల రద్దీ ఉంటుంది. అయితే నవరాత్రుల ప్రత్యేక సందర్భంలో ఆలయ బోర్డు ప్రత్యేక అలంకరణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనం కోసం భక్తులు రెండుమూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అమ్మవారిని దర్శించుకుని, వేడుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. అహ్మదాబాద్‌లో.. గుజరాత్ ప్రభుత్వానికి నవరాత్రి పండుగ నిర్వహణ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. నవరాత్రులకు రాష్ట్రానికి పర్యాటకులు కూడా తరలివస్తుంటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నవరాత్రుల సందర్భంగా అనేక వేదికలు ఏర్పాటవుతాయి. ప్రముఖ గాయకులతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. సామూహికంగా గర్బా నృత్యం చేస్తారు. దాండియా నైట్ నిర్వహిస్తారు. గుజరాత్‌ను సందర్శించాలనుకునేవారు శారదా నవరాత్రులలో వెళితే మరింత ఎంజాయ్ చేయవచ్చని టూర్ నిపుణులు చెబుతుంటారు. గుజరాత్‌లోని పలు ప్రదేశాలు శారదా నవరాత్రులలో అమ్మవారి కీర్తనలతో మారుమోగుతుంటాయి. వారణాసిలో.. వారణాసిని శివుడు కొలువైన నగరం అని అంటారు. నవరాత్రి, దీపావళి తదితర పండుగల సందర్భంగా ఘాట్లపై దీపాలు వెలిగిస్తారు. పురాణాలలోని వివరాల ప్రకారం మాతా సతీదేవి మణికర్ణిక(చెవిపోగు) వారణాసిలో పడిపోయిందని చెబుతారు. దీంతో ఇది కూడా శక్తిపీఠంగా వెలుగొందుతోంది. ఇక్కడ అమ్మవారికి విశాలాక్షి, మణికర్ణి రూపాలలో పూజిస్తారు. పార్వతీ దేవి చెవి పోగు ఇక్కడి కొలనులో పడిపోయిందని, దానిని శంకరుడు కనుగొన్నాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. కేరళలో.. కేరళలో అమ్మవారు కొలువైన దేవాలయాలు అనేకం ఉన్నాయి. అమ్మవారి పూజా సమయంలో ఏనుగులను కూడా పూజిస్తారు. నవరాత్రి సందర్భంగా కేరళలోని కొన్ని దేవాలయాలలో జాతర నిర్వహిస్తారు. విజయదశమి రోజున కేరళీయులు తమ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహిస్తారు. బంగారు ఉంగరం సహాయంతో పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాస్తారు. ఆ రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొట్టాయంలోని పనచ్చిక్కడ్ సరస్వతి ఆలయం, మలప్పురంలోని తుంచన్ పరంబ్, తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయం, త్రిసూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం, ఎర్నాకులంలోని చోటానిక్కర దేవి ఆలయాలలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో.. నవరాత్రుల సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో రథయాత్ర జరుగుతుంది. అమ్మవారికి మహువా లడ్డూలను సమర్పిస్తారు. 52 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో ఉంది. ఈ శక్తిపీఠాన్ని దంతేశ్వరి ఆలయం అని అంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. నవరాత్రి రోజుల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇది కూడా చదవండి: ప్రధాని, రాష్ట్రపతి పదవులు వద్దన్న నేత ఎవరు? -
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు తల్లికి పద్యాభిషేకం
అట్లాంట: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న నెల నెలా తెలుగు వెలుగులో భాగంగాఫిబ్రవరి 27న, 33 వ అంతర్జాల దృశ్య సమావేశం తెలుగు తల్లికిపద్యాభిషేకం అనే కార్యక్రమం అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించారు. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. తక్కువ మాటలతో ఎక్కువ భావాలను పలికించగల శక్తి పద్యానికున్నదంన్నారు. పద్యం రాయగలగడం ఒక ప్రత్యేక కళ అన్నారు. ఈ నాటి కార్యక్రమంలో ఇంతమంది లబ్దప్రతిష్ఠులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూరమాట్లాడుతూ ఏ ఇతర భాషలకూ లేనిపద్యం, అవధానంలాంటి సౌందర్యం, సొగసులు మన తెలుగు భాషకున్నాయన్నారు. ఇంతటి ఘనమైన మన మాతృభాషా పరిరక్షణ కోసం తానా కంకణం కట్టుకుని ఎన్నో దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తున్నదని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ డాక్టర్ వెలుగోటి భాస్కర సాయికృష్ణ మాట్లాడుతూ సాహిత్యలోకంలో అంతగా ప్రచారంలో లేని ప్రముఖ యోగిని, గొప్ప కవయిత్రి తరిగొండ వెంగమాంబ కలం నుండి భాగవతం, వేంకటాచల మహత్యం, రమా పరిణయం, యక్షగాన కృతులు, శివ నాటకం లాంటి అనేక ఉత్తమ సాహిత్య గ్రంథాలు వెలువడ్డాయని తెలిపారు. 12 స్కందాల భాగవతంలో 7, 8, 9, స్కందాలు అలభ్యంగా ఉన్నాయని, వాటి కోసం శోధించవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అక్కిరాజు సుందర రామకృష్ణ, కళారత్న డాక్టర్ మీగడ రామలింగస్వామి, తెలుగుదండు వ్యవస్థాపక అధ్యక్షుడు పరవస్తు ఫణి శయనసూరి, పాతూరి కొండల్ రెడ్డి, గాయకులు చంద్ర తేజ, తాతా బాలకామేశ్వర రావులతో పాటు పలువురు సాహితీ వేత్తలు, కవులు, పండితులు, రచయితలు పాల్గొన్నారు. -
అమరచింత మండలం ఏర్పాటుపై సంబురాలు
ఆత్మకూర్ (నర్వ) : కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త మండలాల ప్రక్రియలో అమరచింతను కొత్త మండలంగా ఏర్పాటుచేసిన విషయంపై శనివారం అమరచింత అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. ఒకప్పడు అమరచింత నియోజకవర్గ కేంద్రంగా కొనసాగి కూగ్రామంగా కనుమరుగైన నేపథ్యంలో నేడు గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులతో పాటు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దేశాయిప్రకాష్ రెడ్డి, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చొరవతో కొత్త మండలాల్లో అమరచింత ఉండడం హర్షించదగ్గ విషయమని బాణాసంచా పేల్చి మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం దేశాయిప్రకాష్ రెడ్డిని కలిసి పూలమాలతో సన్మానించి అభినందనలను తెలియజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు నరేష్‌రెడ్డి, అఖిలపక్షం నాయకులు అయ్యూబ్‌ఖాన్, నాగభూషణం గౌడ్, ఫయాజ్, గోపాల్‌నాయక్, కలాంపాష, రామన్‌గౌడ్, గోపి, నర్సింహులు గౌడ్, మాజీ సర్పంచ్ గోపాల్‌నాయక్ , టీఆర్ఎస్ నాయకులు షానవాజ్ ఖాన్, తోకలి రమేష్, తెలుగు రమేష్, రాజేష్, అంబేద్కర్ జాతరకమిటీ జిల్లా కార్యదర్శి విజయ్ పలువురు పాల్గొన్నారు. -
గౌతమ్స్ ది చైల్డ్‌లో ఘనంగా కలర్స్ డే
తిరుపతి రూరల్ : స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని గౌతమ్స్ ది చైల్డ్ స్కూల్లో శనివారం కలర్స్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తరగతుల వారీగా విద్యార్థులు వివిధ రంగుల దుస్తుల్లో మురిసిపోయారు. క్యారెట్, ఆపిల్, సన్‌ఫ్లవర్, రోజా, మల్లి, పండ్లు, పూల ఆకారంలో మాస్క్‌లు ధరించి సందడి చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, క్యాంపస్ ఇన్చార్జ్ మాధురి పాల్గొన్నారు.