దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు.
ఉత్తర భారతదేశంలో
రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు.
పశ్చిమ భారతదేశంలో
ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్‌లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు.
దక్షిణ భారతదేశంలో
దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు.
తూర్పు భారతదేశంలో
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో దీపావళినాడు కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు!
Comments
Please login to add a commentAdd a comment