న్యూఢిల్లీ: హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్ తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. జులై 2న హత్రాస్ సత్సంగ్‌లో కొందరు వ్యక్తులు విషపూరిత డబ్బాలను తెరిచారని, దీనివల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. ఈ విషయాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తనతో చెప్పినట్లు సింగ్ తెలిపారు.
ఆదివారం(జులై 7) ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడారు. పెరిగిపోతున్న బోలేబాబా పాపులారిటీని ఓర్వలేకే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ‘తొక్కిసలాటకు ముందు 15 మంది దాకా దుండగులు అక్కడ విషపూరిత డబ్బాలను తెరిచారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు నన్ను కలిసి చెప్పారు.
తొక్కిసలాటలో చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలిస్తే వారు ఊపిరాడకపోవడం వల్లే చనిపోయారని స్పష్టంగా తెలుస్తుంది. అంతేగాక సత్సంగ్ సమీపంలోనే దుండగులు పారిపోయేందుకు వాహనాలు కూడా సిద్ధం చేసి ఉంచుకున్నారు. ఇందుకు మా వద్ద ఆధారాలున్నాయి. సాక్షులకు సెక్యూరిటీ ఇవ్వాలి’అని సింగ్ కోరారు.
జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో బోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఘటనపై విచారణకుగాను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను కూడా నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment