పాట్నా: బీహార్‌లో ఏ ముహుర్తాన వంతెనలు ప్రారంభించారు గానీ వరుసగా కూలుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో ఖగారియా జిల్లాలో గంగా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం కిషన్‌గంజ్ జిల్లాలో మరో వంతెన కూలిపోయింది. కాగా రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన కావడం గమనార్హం.
రాష్ట్ర రాజధాని పాట్నాకు 400 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో మెచ్చి నదిపై ఉన్న వంతెన పిల్లర్ కూలిపోయిందని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రాజెక్ట్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. NH-327Eలో నిర్మాణంలో ఉన్న ఈ వంతెన పూర్తయితే కిషన్‌గంజ్, కతిహార్‌లను కలుపుతుందని అయన అన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొన్నారు. వంతెన కూలడంపై దర్యాప్తు కోసం నిపుణులతో కూడిన ఐదుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మానవ తప్పిదం వల్లనే నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్ ఒరిగిపోయినట్లు తెలుస్తోందని అన్నారు.
ఇదే నెల మొదటి వారంలో అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ వంతెన కూడా నిర్మాణంలో ఉండగా కూలిపోవడం గమనార్హం. 2019 నవంబర్‌లో పూర్తి కావాల్సిన ఈ వంతెన నిర్మాణ పనులు మూడేళ్లకు పైగా కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతలోనే కూలిపోవడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా ఒకే నెలలో నిర్మాణంలో ఉన్న రెండు వంతెనలు కూలిపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. ఇసుకలో సిమెంట్‌లో కలిపితే ఇలా జరగవని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment