పాట్నా: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండడంతోపాటు వాటికి సమానంగా గ్యాస్ ధరలు ఆకాశన్నంటుడుతుండడంతో సామాన్యులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఊరట లభించకపోవడంతో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వినూత్నంగా హాజరయ్యారు. గ్యాస్ ధరల పెంపుతో ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కే అంటూ నిరసన వ్యక్తం చేశారు.
బిహార్‌లో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ తన వాహనం నుంచి దిగుతూ కట్టెలు, మట్టి పొయ్యిని చేతిలో పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ధరలు ఎలా పెరుగుతున్నాయో చెప్పేలా ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్యాస్ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు మళ్లీ పాత పద్ధతిలో వంటలు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే షకీల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ లోపలకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది పొయ్యి, కట్టెలను నిరాకరించారు.
ఇక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్ రౌశన్ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారులో కాకుండా అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చి పెట్రోల్ ధరల పెంపుపై ఆందోళన చేశారు. ‘7 గంటలకు సైకిల్‌పై బయల్దేరాను. అసెంబ్లీకి రావడానికి చాలా ఖర్చవుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’ ఎమ్మెల్యే ముఖేశ్ మీడియాతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment