పాట్నా: బిహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది.
అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు.
దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్‌ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్‌లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు.
చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్
Comments
Please login to add a commentAdd a comment