ముజఫర్‌పూర్: హిజాబ్ తొలగించేందుకు నిరాకరించినందుకు టీచర్ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఓ విద్యార్థిని ఆరోపించడం బిహార్‌లో దుమారం రేపింది. ముజఫర్‌పూర్‌లోని మహంత్ దర్శన్ దాస్ మహిళా కాలేజీలో ఆదివారం ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష పాసైన వారే ఇంటర్ ఫైనల్ పరీక్షకు అర్హులవుతారు. చెవులు కనిపించేలా హిజాబ్‌ను తొలగించాలని ఓ ఇన్విజిలేటర్‌గా వచ్చిన టీచర్ కోరగా పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని తిరస్కరించింది.
దీంతో, టీచర్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించారంటూ ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారంపై పరీక్ష నిర్వాహకులు రెండు వర్గాల వారితో మాట్లాడి సర్ది చెప్పి పంపించారు. విద్యార్థులు కొందరు మొబైళ్లు, హెడ్ ఫోన్లతో పరీక్ష హాల్లోకి వస్తున్నారని, బ్లూటూత్‌ను ధరిస్తున్నారనే అనుమానంతోనే ఇన్విజిలేటర్ ఆమెను హిజాబ్‌ను చెవులు కనిపించేలా వెనక్కి తప్పించాలని అడిగారే తప్ప, తీసివేయాలని కాదని కాలేజీ ప్రిన్సిపాల్ కాను ప్రియ తెలిపారు. సదరు విద్యార్థిని చేసిన ఆరోపణలు అవాస్తవాలని తమ విచారణలో తేలిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment