సిద్ధరామయ్య రాజకీయ జీవితంలోని అవినీతి కేసులపై బీజేపీ విమర్శలు
సోషల్ మీడియాలో అవహేళన పోస్టులు
40 ఏళ్లు.. 9 బ్లాక్ మార్క్స్
తనది నిష్కళంక రాజకీయ జీవితమన్న ముఖ్యమంత్రి
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యది ప్రత్యేక స్థానం. ఆయన ముక్కుసూటి మనిషి. కాంగ్రెస్‌లో అధిష్టానానికి.. ముఖ్యంగా గాంధీ కుటుంబానికి విధేయుడి గుర్తింపు. 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈ అపర చాణక్యుడు.. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు చూసిన సిద్ధరామయ్యను ప్రస్తుతం వాల్మీకి కుంభకోణం, ముడా స్థలాల పంపిణీలో అక్రమాల పేరిట ఉన్న రెండు కేసులు నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. 1983లో తొలిసారి ఏడో అసెంబ్లీలో అడుగుపెట్టిన సిద్ధరామయ్య, 1985లోనే మంత్రి పదవిని అలంకరించారు. 1996లో ఉప ముఖ్యమంత్రిగాను, 2013లో తొలిసారి ముఖ్యమంత్రిగా ఇలా ఎన్నో పార్టీ, ప్రభుత్వ పదవులు చేపట్టిన సిద్ధరామయ్య మలి వయసులో ఇబ్బందులు పడుతున్నారు.
సోషల్ మీడియాలో బీజేపీ విమర్శల దాడి :
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి బ్లాక్ మార్కు లేదని గర్వంగా చెప్పుకుని తిరిగే సిద్ధరామయ్యకు జీవితంలో ఒంటి నిండా అవినీతి మరకలు ఉన్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ ఆరోపణలకు బదులు చెప్పలేక సిద్ధరామయ్య మాటలు తడబడుతున్నాయి. ఇదే క్రమంలో సిద్ధరామయ్య పరిపాలన కాలంలో ఏకంగా 9 అవినీతి మరకలు, కుంభకోణాలు ఉన్నాయని బీజేపీ ఒక జాబితాను తయారు చేసి విడుదల చేసింది. ఈ జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిద్ధరామయ్యపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసి తాను సత్యహరిశ్చంద్రుడినని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు సవాలు విసురుతున్నాయి.
తన నిష్కళంక రాజకీయ జీవితంపై బ్లాక్ మార్కు వేయాలని బీజేపీ ముఖ్య నేతలు ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని సిద్ధరామయ్య మాత్రం పదే పదే చెబుతున్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు బదులు చెప్పలేక, ప్రతిపక్ష పార్టీ నేతలపై కూడా చాలా వరకు అవినీతి ఆరోపణలు వచ్చాయని, కానీ వాటిపై ఎప్పుడు విచారణ జరగలేదని ఎద్దేవా చేశారు. తాను మాత్రం ముడా కేసులో న్యాయ విచారణకు సిద్ధపడ్డానని, ఇంతకుమించి ఇంకేమీ చేయాలంటే ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నం చేశారు.
తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి చేయలేదని, తన పేరుకు కళంకం తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ముడా కేసు విషయంపై తనకు ఎలాంటి భయం లేదని, ఎందుకంటే తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఈ బ్లాక్ మార్కు ఎవరు పెడుతున్నారు. సిద్ధరామయ్య తన ఒంటి నిండా అవినీతి మరకలు పెట్టుకుని మాపై నిందలు వేయడమా అంటూ బీజేపీ 9 అవినీతి కుంభకోణ కేసులను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది.
సిద్దూపై బీజేపీ ఆరోపణలు ఇవే
⇒ వజ్రాలతో పొదిగిన హ్యుబ్లాట్ వాచ్ ధరించడం
⇒ ఆర్కావతి లేఔట్ డీనోటిఫిపై
⇒ కృషి భాగ్య పథకంలో వందలాది కోట్ల అవినీతి
⇒ అన్నభాగ్య పథకంలో వేలాది కోట్ల రూపాయల అక్రమాలు
⇒ ఇందిరా క్యాంటీన్‌లో అవినీతి
⇒ ఇందిరా క్యాంటీన్ అవినీతిని కప్పిపుచ్చేందుకు లోకాయుక్త మూసివేత
⇒ వాల్మీకి నిగమలో వందలాది కోట్ల రూపాయల గోల్‌మాల్
⇒ ముడాలో అక్రమంగా స్థలాల పంపిణీ
⇒ సిట్‌ను తమ చేతి కీలుబొమ్మగా మార్చుకుని క్లీన్‌చిట్ పొందడం
Comments
Please login to add a commentAdd a comment