![BJP changes state presidents ahead of 2024 Lok Sabha elections - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/5/bjp-pres.gif.webp?itok=SNyaqDJJ)
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని అధికార బీజేపీ సంస్థాగతంగా కీలక మార్పులు చేపట్టింది. దీంతో, త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందంటూ కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పార్టీకి కొత్త సారథులను నియమించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని, ఏపీ చీఫ్‌గా కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరిని నియమించింది.
అదేవిధంగా, పంజాబ్ బాధ్యతలు సునీల్ జాఖడ్‌కు, జార్ఖండ్ చీఫ్‌గా బాబూలాల్ మరాండీకి బాధ్యతలు అ ప్పగిస్తున్నట్లు బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్‌పర్సన్ బాధ్యతలను ఓబీసీ నేత ఈటెల రాజేందర్‌కు అప్పగిస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా అధికార భారత రాష్ట్ర సమితిని దీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ఈ మార్పులు చేపట్టినట్లు భావిస్తున్నారు.
చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానంలో కేంద్ర మాజీ మంత్రి డి.పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. ఈమె యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అలాగే, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు దీపక్ ప్రకాశ్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖడ్‌కు పగ్గాలు అప్పగించింది. అదేవిధంగా, జార్ఖండ్‌లో గిరిజన నేత, సీఎం హేమంత్ సోరెన్‌ను ఢీకొట్టేందుకు అదే వర్గానికి చెందిన మాజీ సీఎం మరాండీని రంగంలోకి దించింది. మరాండీ తన జార్ఖండ్ వికాస్ మోర్చా(ప్రజాతాంత్రిక్)ను 2020లో బీజేపీలో విలీనం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment