
థానే: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాగా పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మందా మాత్రే ప్రశంసించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులతో సహా ఎవరైనా ఏదైనా విషయం గురించి ముఖ్యమంత్రిని కలిస్తే, ఆయన ఓపికగా వింటారని, ఉపయోగకరమైన సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. నవీ ముంబైలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం అనుమతిని ఇచ్చారని, ఇది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నాయకుల ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి సహకరిస్తున్నప్పుడు ఆయన బాగా పనిచేస్తున్నారని పేర్కొనకుండా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు.
బీజేపీ ముఖ్యమంత్రిని విమర్శిస్తోంది కదా అని విలేకరులు అడగగా, ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కోసం పనిచేస్తారని, అందుకోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఎం బాగా పనిచేస్తున్నారని తాము ప్రశంసిస్తే తప్పేముంటుందని ఎదురు ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల గురించి ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాసిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో మాత్రే కూడా ఉన్నారు.
చదవండి: (జేసీ దివాకర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం)