ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్'ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడాన్ని 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్' అధినేత శరద్ పవార్ ఖండించారు. అధికార దుర్వినియోగానికి బీజేపీ తప్పకుండా మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు.
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని బారామతి వద్ద విలేకరులతో మాట్లాడిన పవార్.. కేజ్రీవాల్ అరెస్టును ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాల గొంతును అణిచివేసేందుకు బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు.
గతంలో మైనింగ్ కేసులో గిరిజన వర్గానికి చెందిన హేమంత్ సోరెన్ (జార్ఖండ్ మాజీ సీఎం)ని, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ) మద్యం పాలసీకి సంబంధించిన కేసులో అరెస్ట్ చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసే స్థాయికి నేడు బీజేపీ వెళ్లిందని పవార్ వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ అరెస్టు కారణంగానే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందా అనే ప్రశ్నకు, పవార్ సమాధానం ఇస్తూ.. తప్పకుండా బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుంది. కేజ్రీవాల్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయనకు ప్రజల మద్దతు ఎక్కువగా ఉందని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ కొనసాగుతారని పార్టీ పేర్కొంది. అవసరమైతే జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఖండిస్తూ, రాబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాల గురించి బీజేపీ భయపడుతోందని, ప్రతిపక్షాలకు సమస్యలు సృష్టించేలా భయాందోళనలకు గురిచేస్తోందని శరద్ పవార్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment