ఢిల్లీ: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు ఘటన 2021నాటి పేలుళ్లతో సంబంధం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2021లో అదే ప్రదేశంలో ఐఈడీ పేలుళ్లకు ప్రస్తుత దాడికి పోలికలు ఉన్నాయని సమాచారం.
పేలుడు ఘటనలో ఇద్దరు అనుమానితులను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. నిందితులు ఇండియా గేట్ వైపు ఆటో రిక్షాను తీసుకెళ్తున్నట్లు పసిగట్టారు. చివరికి జామియా ప్రాంతంలో అనుమానితులను గుర్తించారు. 2021లో ఇదే ప్రదేశంలో ఐఈడీ పేలుడు జరిగింది. ఈ కేసులోనూ నిందితులు జామియా వైపే వెళ్లారు. వారికోసం ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డ్ కూడా ప్రకటించింది. ఈ రెండు పేలుళ్లలోనూ ఘటనాస్థలంలో టైప్ చేసిన అక్షరాలతో కూడిన లేఖ లభ్యమైంది. రెండు కేసుల్లోనూ ఆటోనే ఉపయోగించారు. జామియా వైపే వెళ్లారు.
రెండు పేలుళ్ల ఘటనలకు పోలికలు ఉన్న నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ పోలీసులు, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ సహా ఇతర భారత ఉగ్రవాద నిరోధక సంస్థలు ఆ ప్రాంతాన్ని పరిశీలించి కేసును ఛేదించే పనిలో ఉన్నాయి. పేలుడు నేపథ్యంలో ఇండియాలో ఉన్న తమ దేశస్తులకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద డిసెంబర్ 26న బాంబు పేలుడు సంభవించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ఆక్షేపిస్తూ ఓ లేఖ కూడా ఘటనాస్థలంలో లభ్యమైంది. బాంబు పేలుడు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కానీ ఎంబసీపై దాడిగానే ఇజ్రాయెల్ అధికారులు పరిగణించారు. ప్రస్తుతం ఎన్‌ఐఏ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే
Comments
Please login to add a commentAdd a comment