నైట్‌ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది | BMC To Conduct Surprise Checks On Night Clubs | Sakshi
Sakshi News home page

నైట్‌ క్లబ్‌లపై దాడులు.. పోలీసుల అదుపులో 275 మంది

Published Wed, Dec 16 2020 8:38 AM | Last Updated on Wed, Dec 16 2020 9:33 AM

BMC To Conduct Surprise Checks On Night Clubs - Sakshi

సాక్షి, ముంబై: కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న నైట్‌ క్లబ్బులపై బీఎంసీ అధికారులు సోమవారం రాత్రి ఆకస్మిక దాడులు చేశారు. ఇందులో పట్టుబడిన నాలుగు క్లబ్బులకు షోకాజ్‌ నోటీసులు జారీచేయడమే గాకుండా ఓ క్లబ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. చర్యల్లో భాగంగా నాలుగు క్లబ్‌ల యజమానుల నుంచి రూ.43,200 జరిమానా వసూలు చేశారు. కోవిడ్‌ నియమాలు తుంగలో తొక్కి నైట్‌ క్టబ్బులు నడిపితే కఠిన చర్యలు తప్పవని, క్లబ్‌ యాజమాన్యాలు తమ వైఖరి మర్చుకోకుంటే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌సింగ్‌ చహల్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ క్లబ్‌ యాజమాన్యాలలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. అందులో పార్టీలు చేసుకునే కస్టమర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించడం లేదు. సామాజిక దూరాన్ని పాటించడం లేదు. కస్టమర్ల నిర్లక్ష్యం వల్ల కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదముంది. నియమాలు కచ్చితంగా పాటించాల్సిందేనని చహల్‌ సూచించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం: బీఎంసీ కమిషనర్‌. 
కొన్ని క్లబ్బుల యజమానులు కోవిడ్‌ నిబంధనలను బేఖాతరు చేస్తున్నట్లు బీఎంసీ కమిషనర్‌ చహల్‌ దృష్టికి వచ్చింది. దీంతో నగరంతోపాటు ఉప నగరాలలో అర్ధరాత్రి దాటిన ఆకస్మిక దాడులు చేపట్టారు. అందులో దాదర్‌లోని ప్రీతం హోటల్‌లో, తూర్పు బాంద్రా, మలాడ్, కాందివలిలోని నైట్‌ క్లబ్బుల్లో నియమాలు ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, డ్యాన్స్‌లు చేస్తున్నట్లు బీఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒక్కో నైట్‌ క్లబ్‌లో 50 మందికే అనుమతి ఉంది. కానీ, 100–150 పైనే అందులో కస్టమర్లు ఉన్నారు. అనేక మంది మాస్క్‌ ధరించలేదు. సామాజిక దూరమైతే పటాపంచలైంది. దీంతో 275 మందిని అదుపులోకి తీసుకుని క్లబ్‌ యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులతోపాటు జరిమానా విధించారు. చదవండి: (సోదరిపై ప్రేమతో అతడు చేసిన పని ఇప్పుడు హాట్‌టాపిక్‌..)

ప్రస్తుతం ముంబై, ఉప నగరాలలో కరోనా వైరస్‌ అదుపులోకి వస్తున్నప్పటకీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. మరికొద్ది రోజులు ముఖాలకు మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటి పనులు చేయాల్సి ఉంది. కానీ, కొందరి నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్ల కరోనా మళ్లీ పడగలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి బీఎంసీ సిబ్బంది జరిమానా విధిస్తున్నారు. కానీ, నైట్‌ క్లబ్బుల్లో తొంగిచూసే నాథుడే లేకపోవడంతో అక్కడ విచ్చల విడిగా నియమాల ఉల్లంఘన జరుగుతోంది. దీంతో కరోనా వైరస్‌ పూర్తిగా సద్దుమణిగే దాకా రాత్రి వేళ్లలో దాడులు ఇలాగే కొనసాగిస్తామని చహల్‌ హెచ్చరించారు. క్లబ్‌ యజమానుల్లో మార్పు రాని పక్షంలో చర్యలు మరింత కఠినం చేస్తామని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement