బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌కు భయపడాలా..? | Breakthrough Cases Rising With Delta Variant | Sakshi
Sakshi News home page

బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌కు భయపడాలా..?

Published Sat, Jul 31 2021 3:30 AM | Last Updated on Sat, Jul 31 2021 4:06 AM

Breakthrough Cases Rising With Delta Variant - Sakshi

టీకా తీసుకుంటే కరోనాకు ‘మత్‌ డరోనా’ అనుకుంటూ వచ్చింది ప్రపంచం. కానీ ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. టీకా రెండు డోసులు పుచ్చుకున్నా సరే కరోనా రావచ్చంటున్నాయి తాజా పరిశోధనలు. ఇలా వచ్చే ఇన్ఫెక్షన్‌ను బ్రేక్‌థ్రూ ఇన్‌ఫెక్షన్‌ అంటారు. డెల్టా వేరియంట్‌ దెబ్బకు టీకాల ప్రభావం క్షీణిస్తోందని, అందుకే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్లు ఎక్కువైతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసలీ వార్తలు నిజమేనా? నిజమైతే ఎంతవరకు డేంజర్‌? టీకా తీసుకున్నా కరోనా సోకేట్లయితే ఎందుకు టీకా తీసుకోవడం? తదితర అంశాలపై జరిగిన పరిశోధనల వివరాలపై ఒక లుక్కేద్దాం!

ప్రపంచంలో ఏ వ్యాక్సిన్‌ కూడా 100 శాతం ప్రభావవంతం కాదు. పోలియోను నిరోధించే సాక్‌ వ్యాక్సిన్‌ సైతం 80–90 శాతం మాత్రమే ఎఫెక్టివ్‌. మీజిల్స్‌కు ఇచ్చే టీకా 94 శాతం మాత్రమే ప్రభావశీలి. ఈ గణాంకాల ప్రకారం చూస్తే దాదాపు 95 శాతం ప్రభావం చూపుతున్న మోదెర్నా, ఫైజర్‌ రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ కరోనా టీకాలు బాగానే పని చేస్తున్నట్లు లెక్క. ఒక టీకా 95 శాతం ప్రభావశాలి అంటే 100మంది జనాభాలో 95 మందిని టీకా రక్షిస్తుంది, ఐదుగురికి మాత్రమే వైరస్‌ సోకుతుందని కాదని నిపుణులు వివరిస్తున్నారు.

95 శాతం ప్రభావశాలి అంటే ఒక నిర్ణీత సమూహంలో టీకా తీసుకున్నవారిని, టీకా తీసుకోనివారిని పోల్చిచూసి టీకా ప్రభావాన్ని లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక టీకా ప్రభావశాలిత్వం 95 శాతమంటే, నిర్ణీత కాలంలో 10 వేల మంది జనాభాలో 100మంది టీకా తీసుకోనివారికి వైరస్‌ సోకిందంటే వారిలో ఐదుగురు టీకా తీసుకున్నవారు కూడా ఉన్నారని అర్దం. ఇలా టీకా తీసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్‌ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌ అంటారు. అంటే టీకా ఇచ్చిన రక్షణ కవచాలను ఛేదించుకొని మరీ వైరస్‌ సోకిందన్నమాట!

అందరికీ వస్తుందా?
ఇతర వ్యాధులతో పోలిస్తే కరోనా విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇలాంటి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌కు గురైన వారిలో వ్యాధి తీవ్రత, లక్షణాలు స్వల్పంగా లేదా అసలు కనిపించకుండానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఉదాహరణకు జనవరి– ఏప్రిల్‌ కాలంలో యూఎస్‌లో సుమారు 1.2 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా వీటిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ సంఖ్య 10, 262ని సీడీసీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మే నుంచి కేవలం ఆస్పత్రి పాలైనవారు లేదా మరణించినవారివి తప్ప సాధారణ బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ గణాంకాల సేకరణను సీడీసీ నిలిపివేసింది. జూలై 19నాటికి ఇలాంటి కేసులు సంఖ్య సుమారు 6వేలుంది. ఇదే సమయానికి దేశంలో టీకా తీసుకున్నవారు సుమారు 16 కోట్లు. ఫైజర్, మోదెర్నా టీకాల విషయంలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ సంఖ్య 0.16 శాతముంది. దీన్ని బట్టి బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ చాలా అసాధారణమని తెలుస్తోంది.  

ఎంత సీరియస్‌?
ఒక వ్యక్తి నిర్ధేశిత టీకా డోసులు పూర్తి చేసిన 14 రోజుల అనంతరం అతనికి కరోనా పాజిటివ్‌ వస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌గా భావించాలని సీడీసీ పేర్కొంది. సీడీసీ లెక్కల ప్రకారం మొత్తం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌లో 27 శాతం కేసుల్లో లక్షణాలే కనిపించలేదు. 10 శాతం మంది కరోనాతో పాటు ఇతర సమస్యలతో ఆస్పత్రి పాలయ్యారు. కేవలం 2 శాతం మందిమాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌  తర్వాత మరణించారు. ఇతర అధ్యయనాల్లో సైతం బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌ వల్ల మరణాలు సంభవించలేదనే తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ చాలావరకు డేంజర్‌ కాదనే నిపుణులు చెబుతున్నారు.  

ఎవరికి రావచ్చు?
అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మాములు కరోనా కేసులు ఎక్కువగా ఉండే చోట్లనే బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్‌ కేసులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సామూహికంగా గుమిగూడే ప్రదేశాలను సందర్శించేవారు, కిక్కిరిసిన సమూహంలో పనిచేయాల్సివచ్చినవారు, కరోనా పేషెంట్లతో ఎక్కువ కాలం గడిపే హెల్త్‌లైన్‌ వర్కర్లు, 65ఏళ్ల పైబడినవారు, బీపీ, షుగర్, హృద్రోగాలు, కిడ్నీవ్యాధుల్లాంటి వాటితో బాధపడేవారు, అవయవమార్పిడి జరిగినవారిలో బ్రేక్‌థ్రూ ఇన్ఫెక్షన్స్‌ అధికమని పరిశోధనలు చెబుతున్నాయి. కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల కన్నా మహిళల్లో ఈ బ్రేక్‌థ్రూ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధన జరగాల్సిఉంది.  

డెల్టా వేరియంట్‌ ప్రభావమేంటి?
ప్రస్తుతమున్న కరోనా టీకాలు చాలావరకు తొలిదశ వేరియంట్ల భరతం పట్టేందుకు ఉద్దేశించినవి. అయితే కాలక్రమంలో కొత్త వేరియంట్లు కనిపించినా టీకాల వల్ల పెరిగిన యాంటీబాడీలు ఈ వేరియంట్లను కూడా బాగానే అడ్డుకున్నాయి. అయితే డెల్టా వేరియంట్‌ రంగప్రవేశంతో సీను మారింది. ఈ వేరియంట్‌ కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా ప్రస్తుత టీకాలు కాపాడుతున్నా, పాత వేరియంట్లతో పోలిస్తే దీనిపై ప్రభావం తక్కువగానే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడించాయి. ఉదాహరణకు ఎంఆర్‌ఎన్‌ఏ రెండు డోసులు తీసుకుంటే ఆల్ఫావేరియంట్‌పై 89% ప్రభావం చూపగా, డెల్టాపై 79% ప్రభావమే కనిపించిందని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌ తెలిపింది. కానీ, డెలా ్టకారణంగా ఆస్పత్రి పాలు కాకుండా మాత్రం టీకాలన్నీ బాగానే ప్రభావం చూపుతున్నాయి.  

టీకా తీసుకోవాలా?
అమెరికా సహా పలు దేశాల్లో దాదాపు 35–50 శాతం జనాభా టీకాలు తీసుకున్నారు. అలాగే వయోవృద్ధుల్లో చాలామందికి టీకాలందాయి. వీరందరిలో అత్యధికులను చావు నుంచి తీవ్ర అనారోగ్యం నుంచి టీకా కాపాడినట్లు పరిశోధనలు తెలిపాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్‌లో టీకాల వల్ల ఆస్పత్రిపాలవడం 68 శాతం మేర తగ్గింది. గత మేలో అమెరికాలో కరోనా కారణంగా సంభవించిన మరణాలు 18,000కాగా వీటిలో టీకా తీసుకున్నవారి సంఖ్య 150. అంటే చాలావరకు కరోనా మరణాలు టీకా తీసుకోనివారిలోనే సంభవించినట్లు తెలుస్తోంది. టీకా తీసుకోనివారు కరోనాకు చెందిన ఏ వేరియంట్‌ బారినైనా పడొచ్చని, తద్వారా తీవ్ర అనారోగ్యమో, మరణమో సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల తప్పక టీకాలు తీసుకోవడం మంచిదన్నది నిపుణులందరి మాట!      – నేషనల్‌ డెస్క్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement