అక్కడ పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. వధువును వరునికి అప్పగించే సమయం రానే వచ్చింది. అయితే ఇంతలో ఊహించని ఘటన ఎదురయ్యింది. వరునితో పాటు అతని బంధువర్గం ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకుంది.
రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఒక యువకుడు కొత్త పెళ్లికూతురును ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయాడు. అప్పగింతల అనంతరం నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు.ఇంతలో ఒక యువకుడు తన స్నేహితులతో పాటు అక్కడికి వచ్చి మారణాయుధాలతో అందరినీ బెదిరించి, వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. వధువు తరపువారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకునిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వధువుతో పాటు ఆ యువకుడి కోసం గాలింపు చేపట్టారు.
భీల్వాడా పరిధిలోని బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన కవిత(మార్చిన పేరు)తో వివాహం జరిగింది. అనంతరం వధూవరులు, వారి బంధువులతో పాటు ఒక ఆలయానికి వెళ్లారు. ఇంతలో అక్కడకు ముగ్గురు యువకులు స్కూటర్ మీద వచ్చారు. వారు కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించడంతోపాటు వధువు మెడపై కత్తి పెట్టి ఆమెను తీసుకువెళ్లిపోయారు. అయితే పెళ్లివారు ఆ యువకులను కొంత దూరం వరకూ వెంబడించారు. అయినా ఆ యువకులను పట్టుకోలేకపోయారు. తరువాత వారు ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘ప్రేమికుడే ఈ పని చేశాడు’
ఈ సందర్భంగా వరుడు మాట్లాడుతూ పెళ్లి అనంతరం అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామన్నారు. అదే సమయంలో వధువును కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆ సమయంలో తన భార్య తన చేయి పట్టుకునే ఉందని, తన చేతికి కూడా గాయం అయ్యిందన్నారు. అయితే తన భార్య ప్రేమికుడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. కాగా ఈ ఉదంతంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: ఇక్కడ భాగస్వామికి ఒక్కసారైనా కిస్ పెట్టాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment