ప్రతీకాత్మక చిత్రం
కర్ణాటక(యశవంతపుర): ఓ వైపు ముహూర్తం దగ్గర పడుతోంది... రోడ్డంతా ట్రాఫిక్ జామ్... కల్యాణ మంటపం చేరుకోవడానికి పెళ్లి కుమారుడితో బయలుదేరిన బంధువులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఇక లాభం లేదనుకున్న పెళ్లి కుమారుడు కాలినడకన కల్యాణ మంటపానికి వెళ్లి వధువు మెడలో మూడుముళ్లు వేశారు. చామరాజనగరకు చెందిన వధువుకు, తమిళనాడులోని సత్యమంగళకు చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది.
సత్యమంగల సమీపంలోని బన్నారి ఆలయంలో శుక్రవారం ఉదయం వివాహం జరగాల్సి ఉంది. గురువారం రాత్రి కర్ణాటక, తమిళనాడు సరిహద్దులో సత్యమంగలం అటవీ ప్రాంతం వద్ద రాత్రి సమయంలో వాహన సంచారాన్ని నిషేధించారు. దీంతో మరుసటిరోజు ఉదయం రోడ్డు పొడవునా వందల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఇదే సమయంలో ఓ పెళ్లి కుమారుడు, బంధువులు కారులో వచ్చారు. ట్రాఫిక్ పునరుద్ధరణకు గంటల కొద్ది సమయం పడుతుందని తెలియడంతో పెళ్లి కుమారుడు కాలినడకన మంటపానికి బయలుదేరాడు. సకాలంలో అక్కడికి చేరుకుని వధువు మెడలో తాళికట్టాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment