సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్య్ర భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుని అమృతకాలంలోకి ప్రవేశించిందని.. భారత్ వందేళ్లకు చేరుకునే ఈ 25 ఏళ్లు అమృతకాలమని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలతో ‘ఇండియా@100’ విజన్‌ను ప్రధాని మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఆ విజన్‌కు ప్రస్తుత బడ్జెట్‌లో పునాది వేస్తున్నామన్నారు. విజన్ లక్ష్యాలను సాధించడానికి మూడు మార్గాలను నిర్దేశించుకున్నట్టు వెల్లడించారు.
► అన్ని స్థాయిల్లో సమ్మిళిత అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమం దృష్టి
►డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ రంగాలకు ప్రోత్సాహం.
►టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు, పర్యావరణ పరిరక్షణకు చర్యలు ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వ పెట్టుబడుల పెంపు’’ ఆ మార్గాలని వివరించారు.
పన్నుల వసూలు రాజధర్మం
నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివరాలను ప్రారంభిస్తూ.. మహాభారతంలోని శ్లోకాన్ని ఉదహరించారు. ‘దాపయిత్వకరం ధర్యాం రాష్ట్రం నిత్యం యథావిధి అశేషాంకల్పయేంద్రజాయోగ క్షేమానతంద్రితః’ ..శాంతి పర్వంలోని 72వ అధ్యాయంలో ఉన్న ఈ 11వ శ్లోకం రాజ ధర్మం ఎలా ఉండాలో చెప్తుందని ఆమె చెప్పారు. ‘‘రాజు ధర్మానికి అనుగుణంగా రాజ్యాన్ని పాలించాలి. రాజధర్మంలో భాగమైన పన్నుల వసూలు, ప్రజల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం చూపకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి’’ అని ఆ శ్లోకం అర్థాన్ని వివరించారు. ఈ క్రమంలోనే పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఆదాయ పన్ను సహా ఇతర ట్యాక్సులు వేటికి సంబంధించి కూడా ఉపశమనం కలిగించే చర్యలను నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. పన్నుల ఎగవేతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు.
పన్నులు పెంచలేదు.. చూడండి
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పన్నుల తగ్గింపు, ఐటీ పరిమితి పెంపుపై మధ్యతరగతి వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఉపశమనం ఇవ్వలేదేమని మీడియా ప్రశ్నించగా.. ‘‘కరోనా మహమ్మారి సమయంలో పన్నులు పెంచి ప్రజలపై భారం వేయదలుచుకోలేదు. అందుకే గత రెండేళ్లుగా ఎలాంటి పన్నులు పెంచలేదు..’’ అని సీతారామన్ సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment