నేడే కేంద్ర బడ్జెట్
రికార్డు స్థాయిలో వరుసగా ఏడోసారి ప్రవేశపెట్టనున్న నిర్మల
సంక్షేమనాదమా, అభివృద్ధి నినాదమా?
వేతనజీవికి ఈసారైనా ‘ఐటీ’ ఉపశమనం దక్కేనా?
ఈవీ, ఫార్మా, రియల్టీ తదితర రంగాల్లో ఎన్నో ఆశలు
అమృతకాల బడ్జెట్‌గా మోదీ అభివర్ణిస్తున్న కేంద్ర బడ్జెట్–2024 అన్ని వర్గాల ఆశలపైనా నిజంగానే అమృతం చిలికిస్తుందా? పన్ను వాతలు, ఎడాపెడా కోతలతో ఖేదమే మిగులుస్తుందా? 2047కల్లా వికసిత భారత లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా పడుతున్న బలమైన పునాదిగా ప్రధాని చెప్పుకున్న ఈ బడ్జెట్లో మధ్యతరగతిని ఎంతో కొంత మురిపిస్తారా? ముఖ్యంగా ఐటీ మినహాయింపులు పెంచి వేతన జీవులకు కాస్తయినా ఉపశమనం కలిగిస్తారా? కేవలం ప్రగతి పరుగులకే మరింత ఊపునిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ మరికొద్ది గంటల్లో జవాబులు లభించనున్నాయి.
2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్ కావడం విశేషం. మోదీ 3.0 సర్కారు తొలి బడ్జెట్ నుంచి ఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే...
ఐటీ ఊరట.. ఈసారైనా...!
ఆదాయ పన్ను చెల్లించే మధ్య తరగతి, వేతన జీవులు ఈ బడ్జెట్లోనన్నా ఎంతో కొంత ఊరట దక్కుతుందని ఆశిస్తున్నారు. ఐటీ శ్లాబులను సవరించాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఓటాన్ అకౌంట్లో నిర్మల దీని జోలికి పోలేదు. నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి. తద్వారా వేతన జీవుల చేతిలో మరిన్ని డబ్బులు ఆడతాయని, వారి కొనుగోలు సామర్థ్యం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింతగా కళకళలాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చాలామంది పాత పన్ను విధానానికే మొగ్గుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులకు చోటు దక్కవచ్చని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి. 80సీ తో పాటు స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని కూడా పెంచాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. అది నెరవేరితే రియల్టీ పరిశ్రమకు కూడా మరింత ఊపు వస్తుంది.
రియల్టీ
డేటా సెంటర్లతో పాటు రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టు (ఆర్‌ఈఐటీ)లకు పలు తాయిలాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడమే గాక ఉద్యోగావకాశాల సృష్టికి ఇదెంతో దోహదపడుతుందన్నది రియల్టీ పరిశ్రమ ముఖ్యుల అభిప్రాయం. రియల్టర్లకు నగదు అందుబాటును పెంచేందుకు ఆర్‌ఈఐటీలను ఈక్విటీ ఇన్‌స్ట్రుమెంట్లుగా పరిగణించే అవకాశం ఉందంటున్నారు. ఈ రంగానికి జీఎస్టీ చట్టం కింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతించాలన్న ఆర్‌ఈఐటీ సంఘం డిమాండ్ ఏ మేరకు నెరవేరుతుందన్నదీ ఆసక్తికరమే.
ఈవీలపై ఏం చేస్తారో...
ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) జోరు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిశ్రమకు మరింతగా ప్రోత్సాహకాలను అందించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈవీలకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల పథకం తెస్తే బాగుంటుందన్న అభిప్రాయముంది. అన్నిరకాల ఈవీ వాహనాల తయారీ పూర్తిగా భారత్‌లోనే జరిగేందుకు అనువైన వాతావరణాన్ని కలి్పంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అలాగే ఆటో విడి భాగాలన్నింటిపై జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో పాటు పలు రకాలైన మినహాయింపులను ఆశిస్తున్నాయి. ఈవీ రంగంలో స్టార్టప్‌లకు దన్నుగా నిలిచే దిశగా చర్యలు ఉండవచ్చంటున్నారు. తుక్కు విధానాన్ని కూడా మరింతగా సరళీకరిస్తారేమో చూడాల్సి ఉంది.
ఫార్మా
కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో మరింత కీలకంగా మారిన ఫార్మా రంగానికి పలు ప్రోత్సాహకాలు నిర్మల బడ్జెట్లో చోటుచేసుకునే అవకాశముంది. ముఖ్యంగా పరిశోధన, ఇన్నొవేషన్ కార్యక్రమాలను ప్రోత్సహించే చర్యలు ఉండవచ్చంటున్నారు. ఇప్పటికీ సంక్లిష్టంగానే ఉన్న పలురకాల అనుమతుల ప్రక్రియలను మరింత సరళతరం చేయవచ్చని చెబుతున్నారు. కీలకమైన ఔఫధాల తయారీ తదితరాలకు ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన ప్రకటనపై కూడా ఫార్మా దిగ్గజాలు ఆశలు పెట్టుకున్నాయి.
‘స్వదేశీ’ రక్షణ!
అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు, చైనా దూకుడు తదితర నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులను ఈసారి కూడా ఇతోధికంగా పెంచడం ఖాయంగా కని్పస్తోంది. అదే సమయంలో రక్షణ సంబంధిత ఉత్పత్తి, మౌలిక సదుపాయాల పరిశ్రమల్లో ‘ఆత్మ నిర్భరత’కు మరింత పెద్దపీట వేసేలా మరిన్ని చర్యలు ఉండనున్నాయి. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊపునివ్వడమే గాక అపారమైన ఉపాధి అవకాశాలను కలి్పస్తుందని, అంతిమంగా ప్రజల జీవన నాణ్యతనూ పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment