యూపీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. 15 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో నిందితునికి కోర్టు ఎట్టకేలకు శిక్ష విధించింది. ఒక మైనర్ బాలుడు మరో మైనర్ బాలికకు లవ్ లెటర్ రాశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నేపధ్యంలో బాలిక తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే యూపీలోని బాందా జిల్లాలో 2008లో ఒక మైనర్ బాలునిపై ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో ఆమె ఆ బాలుడు.. తమ కుమార్తె(బాలిక)కు అశ్లీల రీతిలో ఉత్తరం రాయడమే కాకుండా వేధించాడని పేర్కొంది. దీంతో పోలీసులు ఆ బాలునిపై కేసు నమోదు చేశారు. విషయం కోర్టు వరకూ చేరింది.
గత 15 సంవత్సరాలుగా ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇదే సమయంలో పలువురు జడ్జిలు కూడా మారారు. ఎట్టకేలకు చివరికి ఆ యువకుడిని (అప్పుడు బాలుడు) దోషిగా నిర్థారిస్తూ ఏడాదిపాటు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే మూడు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. తెలిసీ తెలియని వయసులో రాసిన ఒక లవ్ లెటర్ కారణంగా ఆ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. ఈ ఉదంతం యూపీలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. 2008 మే 21న ఒక మహిళ తన కుమార్తెకు ఒక కుర్రాడు అశ్లీల రాతలతో కూడిన ఉత్తరం రాశాడని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిని కోర్టుకు అప్పగించారు. ఈ కేసు 2008లో మొదలై 2023 వరకూ ఏకంగా 15 ఏళ్లపాటు సాగింది. ఈ కేసులో 70 నుంచి 80 వాయిదాలు పడగా, పదిమందికిపైగా జడ్జిలు కూడా మారారు. కాగా తాజాగా ఒక ఉన్నతాధికారి ఈ కేసులో చొరవచూపి, త్వరగా కేసును పరిష్కరించాలని జడ్జి బీడీ గుప్తాకు విన్నవించారు.
ఈ నేపధ్యంలో నిందితుడు స్వయంగా జడ్జి ముందు తన తప్పును ఒప్పుకున్నాడు. తాను ఎటువంటి కేసును ఎదుర్కోలేనని, ఇటువంటి తప్పు మరోమారు చేయబోనని విన్నవించుకున్నాడు. దీంతో జడ్జి ఆ యువకుని సత్ప్రవర్తనను గుర్తించి, ఏడాదిపాటు పరిశీలన(ప్రొబెషన్)శిక్ష విధించారు. దీంతో ఆ యువకుడు ప్రాసిక్యూటింగ్ అధికారి పరిశీలనలో ఏడాది పాటు ఉండవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment