
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కేంద్రం మరోసారి ఊరటనిచ్చింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. అలాగే ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపన్ను రిటర్న్‌ల దాఖలు గడువును జనవరి 31 వరకు పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీసీ) విడుదల చేసిన ఒక ప్రకటన ఈ విషయాన్ని స్పష్టంచేసింది.
అంతర్జాతీయ లావాదేవీలు, కొన్ని ప్రత్యేక స్వదేశీ లావాదేవీలు నిర్వహించే పన్ను చెల్లింపుదార్లు తమ ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ఇదివరకు నిర్దేశించిన గడువును జనవరి 31 వరకు పొడిగించారు. ఇతర పన్ను చెల్లింపుదారులకూ గడువును జనవరి 31వరకు పొడిగించారు. దిగువ తరగతి, మధ్యతరగతి పన్ను చెల్లింపుదార్లు తాము స్వయంగా మదింపు చేసిన ఆదాయ పన్ను వివరాలు దాఖలు చేయడానికి మరోసారి వెసులుబాటు కల్పించారు. పన్ను విధింపునకు ఆస్కారం ఉన్న రూ.లక్ష వరకూ ఆదాయం ఉన్న వారు స్వయంగా మదింపు ప్రక్రియ వివరాలు సమర్పించేందుకు జనవరి 31 వరకు అవకాశం కల్పించారు.