బీజేపీ నాయకులను కేసుల్లో ఇరికించేందుకు కుట్ర పన్నారని అభియోగాలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రకు చెందిన బీజేపీ అగ్రనాయకులను తప్పుడు కేసులో ఇరికించేందకు కుట్ర పన్నారనే అభియోగాలతో మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ (ఎన్సీపీ– ఎస్‌పీ)పై సీబీఐ బుధవారం తాజాగా కేసు నమోదు చేసింది. 2020లో ఈ కుట్ర జరిగిందని తెలిపింది. 2020లో ప్రతిపక్షంలో ఉన్నపుడు దేవేంద్ర ఫడ్నవీస్ అప్పటి స్పీకర్‌కు ఒక పెన్‌డ్రైవ్‌ను అందజేశారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్.. అనిల్ దేశ్‌ముఖ్, ఇతరులతో కలిసి బీజేపీ నాయకుడు గిరీష్ మహజన్ (ప్రస్తుతం మంత్రి)ని ఇరికించడానికి ప్రయతి్నంచినట్లుగా పెన్‌డ్రైవ్‌లోని వీడియోల్లో ఉన్నట్లు సీబీఐ చెబుతోంది.
పండిత్ చవాన్ ప్రముఖ బీజేపీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలు కుట్రలకు తెరతీసినట్లు ఈ వీడియోల్లో స్పష్టం ఉందని ప్రాథమిక విచారణలో గిరీష్ మహజన్‌తో సహా నలుగురు ఎమ్మెల్యేలు.. సీబీఐకి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడం. సాక్షులను చిత్రహింసలు పెట్టడం, నగదు చెల్లింపులు, దర్యాప్తు అధికారులకు సూచనలు ఇవ్వడం.. ఇలా పక్కా పథకరచన చేశాడని ఆరోపించారు. డీసీపీ పూరి్ణమ గైక్వాడ్, ఏసీపీ సుష్మా చవాన్‌లతో కలిసి సాక్షుల వాంగ్మూలను, ఆధారాలను మార్చేశాడని పేర్కొన్నారు. తాజా ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ అనిల్ దేశ్‌ముఖ్‌తో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రవీణ్ పండిత్ చవాన్, పూర్ణిమ, సుష్మ, న్యాయవాది విజయ్ పాటిల్‌లను నిందితులుగా పేర్కొంది. అవినీతి ఆరోపణలపై అనిల్ దేశ్‌ముఖ్ ఇప్పటికే సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఆయనపై ఈడీ కేసు కూడా నమోదైంది.
ఉపముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవంద్ర ఫడ్నవీస్ బెంబేలెత్తిపోయి తనపై నిరాధార కేసును నమోదు చేయించారని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును చూసి.. కాళ్ల కింద నేల కదులుతోందని గ్రహించి ఫడ్నవీస్ ఇలాంటి కుట్రలకు దిగారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment