
అయోధ్య: మూడు దశాబ్దాలుగా తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెల్లడించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్‌కి ఇదే ఆఖరి తీర్పు. ఆయన తన కెరీర్‌లో మొట్టమొదటి సారిగా ఫైజాబాద్ జిల్లా (ఇప్పుడు అయోధ్య జిల్లాగా పేరు మార్చారు) అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అదే అయోధ్యకు సంబంధించిన అత్యంత కీలకమైన తీర్పునిచ్చి ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఏర్పాటైన లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిసైడింగ్ అధికారిగా ఎస్‌కే యాదవ్ అయిదేళ్ల క్రితం 2015, ఆగస్టు 5న నియమితులయ్యారు. అప్పట్నుంచి ఆయన ఆధ్వర్యంలోనే కేసు విచారణ నడుస్తోంది. ఏళ్లకి ఏళ్లు విచారణ గడుస్తూ ఉండడంతో ప్రతీ రోజూ విచారణ జరిపి, రెండేళ్లలో తీర్పు చెప్పాలంటూ 2017 ఏప్రిల్ 19న సుప్రీం కోర్టు ప్రత్యేక కోర్టుని ఆదేశించింది. అప్పట్నుంచి ఎస్‌కే యాదవ్ ప్రతీ రోజూ కేసుని విచారించారు.
ఏడాది కిందటే పదవీ విరమణ కానీ..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్ జిల్లా పఖాన్‌పూర్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ 31 ఏళ్ల వయసులో జ్యుడీషియల్ సర్వీసెస్‌లోకి వచ్చారు. ఫైజాబాద్ మున్సిఫ్ కోర్టులోకి అడుగు పెట్టి జిల్లా జడ్జి వరకు ఎదిగి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. గత ఏడాదే న్యాయమూర్తిగా ఆయన పదవీ విరమణ చేశారు. లక్నో బార్ కౌన్సిల్ ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం కూడా చేసింది. అయితే అయిదేళ్లుగా కేసు విచారిస్తూ ఉండడంతో సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయమూర్తిగా ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ న్యాయం జరుగుతుందని భావిస్తే సుప్రీం కోర్టుకి న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడిగించే హక్కు ఉంది. అలా కూల్చివేత ఘటనలో తీర్పు చెప్పిన న్యాయమూర్తిగా యాదవ్ రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment