CBSE Class 10th Result: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదోతరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈసారి మునుపెన్నడూ లేనివిధంగా విద్యార్థులు అత్యధికంగా 99.04% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది ఉత్తీర్ణతా శాతం 91.46% కాగా, ఈసారి ఏడు శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదేవిధంగా, గత ఏడాది బాలురు, బాలికల మధ్య ఉత్తీర్ణతా శాతం 3.5% కాగా, బాలికలు స్వల్పంగా 0.35% ఆధిక్యం చూపారు. బాలికలు, బాలుర ఉత్తీర్ణతా శాతాలు వరుసగా 99.24, 98.89 ఉండగా ట్రాన్స్‌జెండర్లు 100% ఉత్తీర్ణత సాధించారు. కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలను రద్దుచేసిన సీబీఎస్‌ఈ ఆల్టర్నేటివ్ అసెస్‌మెంట్ విధానం ఆధారంగా ఫలితాలను ప్రకటించింది.
ఈ ఏడాది 21.13 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా, ఇంకా 16,639 మంది విద్యార్థుల ఫలితాలను ప్రకటించాల్సి ఉందని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ ఏడాది మెరిట్ జాబితాతోపాటు మెరిట్ సర్టిఫికెట్ల జారీ కూడా ఉండదని స్పష్టం చేశారు. 17,636 మంది విద్యార్థులకు కంపార్ట్‌మెంట్ పరీక్షను ఆగస్టు 16–సెప్టెంబర్ 15వ తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉందన్నారు. తేదీని తర్వాత ప్రకటిస్తామన్నారు. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో త్రివేండ్రం రీజియన్ అత్యధికంగా 99.99% మార్కులు, ఆతర్వాత బెంగళూరు 99.96% ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. 95% కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 41,804 మంది కాగా, ఈసారి 57,824కు పెరిగినట్లు వెల్లడించారు. 90–95 శాతం మధ్య స్కోర్ చేసిన వారి సంఖ్య కూడా 1,84,358 నుంచి ఈసారి 2,00,962కు పెరిగినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment